ప్రస్తుత కాలంలో సినిమాలతో పాటు ఓటీటీ లకు కూడా ప్రేక్షకులు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఓటీటీ లు బాగా కలసి వస్తున్నాయి. ఓటీటీ ల ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలో పెద్ద పెద్ద సెలబ్రెటీలు కూడా వెబ్ సిరీస్ వైపు చూస్తున్నారు. ఓటీటీ లలో వచ్చిన చాలా వెబ్ సిరీస్ లు మంచి ఆదరణ పొందాయి కూడా. త్వరలో మరో తెలుగు వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోడానికి వచ్చేస్తోంది. హీరో నాని నిర్మాతగా దీప్తి గంటా దర్శకత్వంలో ఆంథాలజీగా రూపొందించిన 'మీట్ క్యూట్' వెబ్ సిరీస్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ శుక్రవారం విడుదలైంది.
నాని నిర్మాతగా..
వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని ఈ సిరీస్ ను నిర్మించారు. ఐదు కథల ఆధారంగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్ లో వర్ష బొల్లమ్మ, శ్రీదివ్య, సమీర్, అశ్విన్ కుమార్, సత్యరాజ్, రుహానీ, రాజ్ చెంబోలు, రోహిణి మొల్లేటి, దీక్షిత్ శెట్టి అలేఖ్య హారిక, ఆదా శర్మ, శివ కందుకూరి, సునైన, ఆకాంక్షా సింగ్, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలో సోని లివ్ లో మీట్ క్యూట్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
ట్రైలర్ ఎలా ఉందంటే..
ఏదైనా రిలేషన్ లో గొడవలు వస్తే వాటిని పరిష్కరించుకొని మళ్ళీ ఎలా సంతోషంగా ముందుకుకెళ్ళాలి అనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ప్రస్తుత యువత ఆలోచనా ధోరణికి అద్దం పట్టే విధంగా కూడా కథ ఉన్నట్లు అనిపిస్తోంది. ఇటీవలి కాలంలో యువత జీవితాల్లోని పడే సంఘర్షణ, అయోమయం, అనుమానాలు ఇలా ఎన్నో అంశాలు ఇందులో కనిపిస్తాయి.
"నీకు మీట్ క్యూట్ అంటే తెలుసా? అనుకోకుండా ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు మొదటిసారి కలుసుకున్నప్పుడు వాళ్ల మధ్య జరిగే అందమైన సంభాషణలు, ఆ జ్ఞాపకాలు అవన్నీ జీవితాంతం గుర్తుండిపోతాయి” అంటూ నాని వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. అలాగే "ఈ మనిషితో గొడవపడటం అనవసరం అనుకున్నప్పుడే బంధాలు ఫెయిల్ అవుతాయి. మనం ప్రేమించే వాళ్లతోనే కదా గొడవపడతాం" అంటూ సాగే సత్యరాజ్ సంభాషణలు కూడా ఆలోచింపజేసేలా ఉన్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం కూడా బాగుండటంతో ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తి నెలకొంది. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 25 నుంచి సోని లీవ్ లో ప్రసారం కానుంది.
Also Read: తండ్రి ఆస్పత్రిలో ఉన్నా మరో ప్రాణం కాపాడిన మహేష్ - ఆకాశానికి ఎత్తేస్తున్న నెటిజన్లు!
ఇక నాచురల్ స్టార్ నాని అంతకముందు 'వి', 'టక్' జగదీష్' లాంటి సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్ ను తెచ్చుకున్నాయి. ఇటీవల నాని 'అంటే సుందరానికీ' సినిమా లో నటించాడు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా పర్వాలేదనిపించింది. నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల అనే దర్శకుడితో 'దసరా' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్స్ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.