నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా విడుదలై మూడేళ్లు అవుతోంది. జాతీయ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న ఈ సినిమా నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 'జెర్సీ' విడుదలై మూడేళ్లవుతున్న సందర్భంగా ఈ సినిమాలో తొలగించిన సన్నివేశాన్ని విడుదల చేశారు. 


మూడేళ్ల తరువాత డిలీటెడ్ సీన్ రిలీజ్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. కానీ ఈ సీన్ చూస్తే మాత్రం సినిమాలో ఉంటే బాగుంటుందనిపిస్తుంది. ఉద్యోగం పోగొట్టుకొని మళ్లీ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తోన్న హీరో దగ్గరకి అతడి భార్య తండ్రి వచ్చి.. కొంత డబ్బు ఇచ్చి పోయిన ఉద్యోగాన్ని తిరిగి తెచ్చుకోవాలని చెబుతాడు. కానీ హీరో ఆ డబ్బు తీసుకోకపోవడంతో అతడిని అవమానించేలా కొన్ని కామెంట్స్ చేస్తాడు. 


కానీ హీరో మాత్రం అవేమీ పట్టించుకోకుండా బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్లిపోతాడు. ఈ సీన్ చూస్తున్నంతసేపు కాస్త ఎమోషనల్ గా అనిపిస్తుంది. ఈ సీన్ అంటే దర్శకుడు గౌతమ్ కి కూడా చాలా ఇష్టమట. కానీ సినిమాలో ఈ సీన్ ను పెట్టే ఛాన్స్ రాలేదని చెబుతూ నాని సోషల్ మీడియా వేదికగా ఈ సన్నివేశాన్ని షేర్ చేశారు. 


ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. రోనిత్, సత్యరాజ్ వంటి నటులు కీలకపాత్రలు పోషించారు. ఇప్పుడు ఇదే టైటిల్ తో బాలీవుడ్ లో ఈ సినిమా రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ రీమేక్ కొన్ని కారణాల వలన వాయిదా పడుతోంది. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటించారు.


Also Read: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్, ఈ వారం థియేటర్లు, ఓటీటీ విడుదలయ్యే సినిమాలు ఏవో తెలుసా?