Nellore Ysrcp Flexi Politics : నెల్లూరులో అనధికారిక ఫ్లెక్సీలకు చోటే లేదని తేల్చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్. ఆయన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే. అక్కడ ఎవరూ అనధికారిక ఫ్లెక్సీలు పెట్టవద్దంటున్నారు. అసలు ఎందుకు ఈ ప్లెక్సీల గొడవ వచ్చిందంటే  మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సిటీలో పర్యటించారు. ఆనం ఇంటికి వెళ్లారు. ఈ సందర్బం నగరం మొత్తం ఫ్లెక్సీలు పెట్టారు. కానీ చాలా ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో వివాదం ప్రారంభమయింది. ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకూడదని అనిల్ కుమార్ భావిస్తున్నారు. కానీ కాకాణి గోవర్దన్ రెడ్డి మాత్రం .. అనిలే చేయించాడని పరోక్షంగా చెబుతూ అలాంటిదేమీ లేదని లౌక్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. 


ఫ్లెక్సీలు సంఘ విద్రోహశక్తులు తీసేసి ఉంటాయన్న కాకాణి !


ఇద్దరి మధ్య గ్యాప్ ఉన్నప్పుడు దాన్ని పెంచడానికి సంఘవిద్రోహ శక్తులు ప్రయత్నిస్తాయని, దాన్ని పెద్దది చేయాలని చూస్తాయని అన్నారు కాకాణి. అలాంటి వ్యవహారం నెల్లూరులో జరిగి ఉండొచ్చని చెప్పారు. అనిల్ వెళ్లి కాకాణి ఫ్లెక్సీ చించరు, కాకాణి వెళ్లి అనిల్ ఫ్లెక్సీ చించరు కదా అని అన్నారు కాకాణి.అంటే కాకాణి తమ మధ్య గ్యాప్ ఉందని అంగీకరించడమే కాకుండా ఫ్లెక్సీలను తీసేసిన వారిని సంఘ విద్రోహ శక్తులుగా చెప్పేశారు. ఇది ఆనిల్ వర్గీయుల్ని మరింత ఆగ్రహానికి గురి చేసింది. మరో వైపు తాము పెట్టిన ఫ్లెక్సీలను తీసేయడంపై ఆనం కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్లెక్సీలను తొలగించడం సరికాదన్నారు ఆనం కుటుంబ సభ్యులు. నెల్లూరు నగరానికి రావాలంటే టోల్ ఫీజు చెల్లించాలా అని ప్రశ్నించారు. 


అనధికారిక ఫ్లెక్సీలకు చోటు లేదన్న అనిల్ కుమార్ ! 


 
ఫ్లెక్సీల విషయంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చేసిన కామెంట్లు ఇప్పుడు మరింత సంచలనంగా మారాయి. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అనధికారిక ఫ్లెక్సీలకు చోటు లేదని స్పష్టం చేశారు అనిల్ కుమార్ యాదవ్. ఫ్లెక్సీల విషంయలో గతంలోనే తాను ఓ నిర్ణయాన్ని తీసుకున్నామని .. అందువల్లే కార్పొరేషన్ సిబ్బంది అనధికారికంగా ఏర్పాటు చేసిన వాటిని తొలగిస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. సిటీ నియోజకవర్గ పరిధిలో తన ఫ్లెక్సీలు కూడా వేసుకోవడంలేదని అనిల్ గుర్తు చేశారు. ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలు వేస్తే తొలగించక ఏం చేస్తారని అన్నారు. ఫ్లెక్సీల విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఎవరి కోసమూ సవరించబోమన్నారు. 


 ఇరు వర్గాల మధ్య అంతకంతకూ పెరుగుతున్న వివాదం !


తన నియోజకవర్గంలో అనధికారిక ఫ్లెక్సీలకు చోటు లేదంటున్నారు అనిల్. మరోవైపు కక్షగట్టుకుని తమ ఫ్లెక్సీలనే తీసేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఆనం, కాకాణి వర్గీయులు. అనిల్ ది నెల్లూరు సిటీ నియోజకవర్గం కాబట్టి.. అందరికీ నెల్లూరుతో సంబంధాలుంటాయి. ఎవరు ఎక్కడ ఏ పని మొదలు పెట్టినా, నెల్లూరులో ఫ్లెక్సీ వేయించుకోవాలనుకుంటారు. దీంతో ఇప్పుడీ వ్యవహారం మరింత పెద్దదిగా మారుతోంది. హైకమాండ్ ఇంకా జోక్యం చేసుకోకపోవడంతో ఇరు వర్గాలూ వెనక్కి తగ్గడం లేదు.