'ఆర్ఆర్ఆర్' కోసం రెండు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. తర్వాత ఆ రెండూ కాకుండా మార్చి 25ను ఫైనలైజ్ చేశారనుకోండి. 'భీమ్లా నాయక్' కోసం కూడా రెండు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. ఏది ఫైనలైజ్ అవుతుందనేది తెలియదు. ఇదే రూటులో 'గని', 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలు కూడా రెండేసి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాయి. నేచురల్ స్టార్ నాని మరో అడుగు ముందుకేశారు. ఒకటి కాదు... ఏడు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు.


నాని కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'అంటే సుందరానికి'. ఇందులో మలయాళ కుట్టి నజ్రియా నజిమ్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ .వై నిర్మిస్తున్నారు. వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


సినిమా ఫస్ట్ లుక్, జీరోత్ టీజ‌ర్‌ విడుదల చేసినప్పుడు కూడా 'అంటే సుందరానికి చ‌మ్మ‌ర్‌లో చ‌క్కిలిగింత‌లా' అంటూ చిన్నపిల్లలతో చెప్పించారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే వేసవిలో చాలా సినిమాలు క్యూ కట్టాయి. అందుకని, నాని ఏడు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. వీలును బట్టి ఏదో ఒక తేదీలో వస్తామని చెప్పడం అన్నమాట. అలాగే, రిలీజ్ డేట్స్ గందరగోళం మీద సెటైర్ కూడా అనుకోవచ్చు.


'మీరంతా రెండు మూడు బ్లాక్ చేస్తే... మేము ఏడు చేయకూడదా?' అని నాని అడిగారు. 'ఫుల్ ఆవకాయ సీజన్ బ్లాక్డ్. మెల్లగా డిసైడ్ చేద్దాం' అని ఆయన అన్నారు. ఏప్రిల్ 22, 29 లేదంటే మే 6, 20, 27 లేదంటే జూన్ 3, 10... ఏదో ఒక తేదీలో 'అంటే సుందరానికి' వస్తుందన్నమాట.