'ఒకటో నెంబర్ కుర్రాడు' సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు తారకరత్న. కెరీర్ ఆరంభంలో ఎన్నో సినిమాలు చేసిన ఈ నటుడు సరైన హిట్టుని అందుకోలేకపోయారు. దీంతో హీరోగా అవకాశాలు తగ్గాయి. అయితే అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ కి పోటీగా నందమూరి ఫ్యామిలీ తారకరత్నను తెరపైకి తీసుకొచ్చిందనే ప్రచారం జరిగింది. తాజాగా ఈ వివాదంపై తారకరత్న క్లారిటీ ఇచ్చారు.
రీసెంట్ గా ఆయన నటించిన '9 అవర్స్' అనే వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికోసం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు తారకరత్న. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనకు ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎన్టీఆర్ కి కాంపిటిషన్ గా తారకరత్నను నందమూరి ఫ్యామిలీ తీసుకొచ్చిందనే ప్రచారంపై యాంకర్ ప్రశ్నించగా.. తారకరత్న రియాక్ట్ అయ్యారు.
తమ్ముడు ఎన్టీఆర్ తరువాతే తను సినిమాల్లోకి వచ్చినట్లు చెప్పారు. అప్పటికే ఎన్టీఆర్ 'ఆది' లాంటి హిట్స్ ఇచ్చాడని.. తను ఎన్టీఆర్ కి కాంపిటిషన్ కాదని.. ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదని చెప్పారు. ఎన్టీఆర్ కి కాంపిటిషన్ గా తనను లాంచ్ చేశారనే విషయంలో నిజం లేదని.. హీరో కావాలనేది తన డ్రీమ్ అని, దానికి తన తండ్రి, బాబాయ్ సపోర్ట్ చేసి ఓకే చెప్పారని తెలిపారు.
ఎన్టీఆర్ గ్రేట్ ఆర్టిస్ట్ అని.. మేమంతా నందమూరి బిడ్డలేమని.. ఈరోజు నందమూరి ఫ్యామిలీ లెగసీ కంటిన్యూ అవుతుందంటే దానికి ఎన్టీఆర్ కూడా ఒక కారణమని పేర్కొన్నారు. ఎవరు ముందుకు వెళ్లినా.. నందమూరి ఫ్యామిలీనే ముందుకు వెళ్తుందని.. తమ్ముడు ఎన్టీఆర్ తీసుకెళ్లినా, అన్న కళ్యాణ్ రామ్ తీసుకెళ్లినా తనకు సంతోషమే అని చెప్పారు. ఎన్టీఆర్ సక్సెస్ చూసి ఒక అన్నగా ఎంతో సంతోషపడతానని చెప్పుకొచ్చారు.
Also Read: 'విక్రమ్' సినిమా ఓటీటీ-శాటిలైట్ రైట్స్ ఎంతంటే?