మెగాస్టార్ చిరంజీవి కమిట్ అయిన సినిమాల్లో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల సినిమా కూడా ఉంది. అయితే ఈ సినిమా ఆగిపోయిందని.. వెంకీ చెప్పిన కథ చిరుకి నచ్చలేదని ఇలా చాలా మాటలు వినిపించాయి. తాజాగా ఈ వార్తలపై పరోక్షంగా స్పందించారు దర్శకుడు వెంకీ కుడుముల. ఈరోజు విడుదలైన 'విక్రమ్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటుడు కమల్ హాసన్ ని వెంకీ కుడుముల ఇంటర్వ్యూ చేశారు. 


ఈ సినిమాను తెలుగులో నితిన్ రిలీజ్ చేస్తున్నారు. 'భీష్మ' సినిమాతో నితిన్ కి బాగా క్లోజ్ అయ్యారు వెంకీ కుడుముల. అందుకే అతడితో కమల్ ని ఇంటర్వ్యూ చేయించారు. ఈ సందర్భంగా చిరుతో వెంకీ చేయబోయే సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. 'విక్రమ్' సినిమా దర్శకుడు లోకేష్.. కమల్ కి వీరాభిమాని. ఒక అభిమాని అయితేనే తన హీరోని తెరపై ఎలా ప్రెజంట్ చేయాలో తెలుస్తుందని చెబుతూ లోకేష్ ని పొగిడారు వెంకీ కుడుముల. 


తాను కూడా చిరంజీవిని ది బెస్ట్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఆ సమయంలో కమల్ జోక్యం చేసుకొని.. కేవలం అభిమాని అయితే సరిపోదని.. తమ ఫేవరెట్ హీరో చేసిన సినిమాల గురించి తెలుసుకొని.. ఎక్కువ పేరు తీసుకొచ్చిన సినిమా ఏదో చూడాలని అన్నారు. చిరంజీవిని దర్శకుడు బాలచందర్ ఆర్ట్ తరహా సినిమాలో అద్భుతంగా చూపించారని.. అలానే రాఘవేంద్రరావు కమర్షియల్ సినిమాల్లో గొప్పగా ప్రెజంట్ చేశారని అన్నారు. ఈ రెండు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ చిరంజీవితో సినిమా తీయాలని తన అభిప్రాయం చెప్పారు కమల్. కచ్చితంగా ప్రయత్నిస్తానని చెప్పారు వెంకీ కుడుముల.