లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ సినిమా 'విక్రమ్'. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను రూపొందించారు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ వంటి తారలు నటించిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రముఖ సంస్థ డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలిపి రూ.200 కోట్లకు కొనుక్కున్నట్లు సమాచారం. ఈ రేంజ్ లో రైట్స్ పలికాయంటే మామూలు విషయం కాదు. కానీ ఇందులో పేరున్న స్టార్స్ ఉండడం, సినిమాకి పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడంతో ఇంత మొత్తం పలికిందని తెలుస్తోంది. ఈ సినిమాలో కమల్ హాసన్ 'రా' ఏజెంట్ గా కనిపించారు. 


రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శివాని నారాయణన్, కాళిదాస్ జయరామ్, అర్జున్ దాస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందించారు. కమల్ కెరీర్లో 232వ సినిమా ఇది. ఈ సినిమాకి లోకేష్ రూపొందించిన 'ఖైదీ' సినిమాకి లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. 'ఖైదీ' చూసిన తరువాత 'విక్రమ్' చూడాలంటూ సోషల్ మీడియాలో సలహాలు ఇస్తున్నారు నెటిజన్లు.