Reliance Industries: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) స్టాక్ మార్కెట్లో రికార్డులు సృష్టిస్తోంది. మరోసారి రూ.19 లక్షల మార్కెట్ విలువను అందుకుంది. శుక్రవారం రోజు ఈ కంపెనీ షేర్లు 3 శాతం పెరిగి రూ.2,816 వద్ద కొనసాగుతున్నాయి. 2022, ఏప్రిల్ 24న నమోదు చేసిన 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.2,855కు కొద్ది దూరంలోనే ఉన్నాయి.
కేవలం రెండు వారాల్లోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు మదుపర్లకు అంతులేని సంపదను సమకూర్చి పెట్టాయి. దాదాపుగా 14 శాతం ఎగిశాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు షేర్ల ధర 20 శాతం పెరగడం గమనార్హం. 2022, మే 15తో మొదలైన వారంలో రిలయన్స్ షేర్లు రూ.2,624 వద్ద ముగిశాయి. ఆ వారంలో 8.15 శాతం పెరిగాయి. ఆ తర్వాతి వారం 1.88 శాతం నష్టపోయి రూ.2,575 వద్ద ముగిశాయి. మే 29తో మొదలైన ఈ వారంలో 9 శాతం పెరగడంతో షేరు ధర రూ.2,810కి చేరుకుంది. మొత్తం 2 వారాల్లో రిలయన్స్ షేరు రూ.190 మేర లాభపడింది.
దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం రిలయన్స్ సొంతం. అనేక రంగాల్లోకి ఈ సంస్థ విస్తరించింది. తాజాగా ఎడ్యు టెక్ స్టార్టప్ లిడో లెర్నింగ్‌లో పెట్టుబడి పెట్టబోతోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటలీకి చెందిన ప్లాస్టిక్ లెగ్నోస్ బొమ్మల తయారీ ఇండియా బిజినెస్‌లో రిలయన్స్ బ్రాండ్స్ 40 శాతం వాటా కొనుగోలు చేయనుందని తెలిసింది. హామ్‌లెస్, క్లోవియా, మిల్క్ బాస్కెట్, అర్బన్ లాడర్, హప్టిక్ వంటి స్టార్టప్పులో పెట్టుబడులు పెడుతోంది. దేశంలోని చిన్న, మధ్య తరహా వస్తువల తయారీ కంపెనీల్లో వాటాలు దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తోంది.
2022, మార్చితో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 22.50 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయంలోని రూ.13,227 కోట్లతో పోలిస్తే రూ.16,203 కోట్ల లాభం నమోదు చేసింది. ఆపరేషన్స్ ఆదాయం 26.79 శాతం పెరిగి రూ.211,887 కోట్లకు చేరుకుంది. కంపెనీ వృద్ధిరేటు బాగుండటంతో కొన్ని బ్రోకరేజ్ సంస్థలు రిలయన్స్ షేర్లను హోల్డ్ చేసుకోవాలి, వీలుంటే ఎక్కువ కొనుగోలు చేయాలని సూచిస్తున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.