Bhagya Laxmi Temple Offer Prayers at Bhagya Laxmi Temple: కరోనా బారిన పడిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ  కొవిడ్19 నుంచి త్వరగా కోలుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆకాంక్షించారు. సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయంలో శుక్రవారం ఉదయం ప్రతేక పూజలు చేశారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. సోనియమ్మ త్వరగా కోలుకోవాలని ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పూజలు చేస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన, నిజం చేసిన సోనియా ఆరోగ్యం బాగుండాలని మతాలకు అతీతంగా ప్రజలు, నేతలు పూజలు చేస్తున్నామని భట్టి తెలిపారు.


బండి సంజయ్ వాఖ్యలు హాస్యాస్పదం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన వాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. బండి సంజయ్ పుట్టక ముందు నుంచే కాంగ్రెస్ నేతలు భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారికి పూజలు చేశారని గుర్తుచేశారు. బీజేపీ నేతలు హిందూవులు అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారని.. భాగ్యలక్ష్మి అమ్మవారు అందరి దేవత అని భట్టి అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ నేతలు లబ్దిపొందాలని చూస్తున్నారని.. బీజేపీ నేతల కామెంట్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. భాగ్యలక్ష్మి దేవాలయం బండి సంజయ్ కి ఏవరైనా రాసిచ్చారా? అని భట్టి ప్రశ్నించారు. భాగ్యలక్ష్మి టెంపుల్ బండి సంజయ్ జాగీరు కాదు. మతాల మధ్య చిచ్చు పెట్టే, విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని.. లేకుంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బండి సంజయ్ కి బుద్ధి చెబుతారని భట్టి విక్రమార్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


వీహెచ్, కాంగ్రెస్ సీనియర్ నేత
తెలంగాణ అవిర్భావ దినోత్సవం రోజు సోనియాకి కరోనా రావడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ నేతలు విచారం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆకాంక్షించారు. చార్మినార్ లో నమాజ్ వివాదానికి సంబంధించి ఎలాంటి ప్రస్తుతం తాను ఏ కామెంట్ చేయనని, తరువాత మాట్లాడతా అన్నారు. మేం పుట్టి పెరిగింది ఒక్కడే మాకు కథలు చెప్పొద్దంటూ బండి సంజయ్ కి వీహెచ్ హితవు పలికారు. ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, హైదరాబాద్‌లోని పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


భాగ్యలక్ష్మి ఆలయంపై చేయి వేస్తే చూస్తూ ఊరుకోబోమని బీజేపీ నేతలు చేసిన కామెంట్లపై భట్టి విక్రమార్క స్పందిస్తూ.. ఆలయాన్ని కూల్చుతామని, మార్చుతామని తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.  చార్మినార్ లో నమాజ్ కి అనుమతివ్వాలని సంతకాల సేకరిస్తున్న కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్, త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలుస్తానని చెప్పడాన్ని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తప్పు బట్టారు. దీంతో చార్మినార్, భాగ్యలక్ష్మీ ఆలయాలపై కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు.