తెలిసి చేసినా, తెలియక చేసినా కొన్నిసార్లు పొరపాట్ల వల్ల చిక్కుల్లో ఇరుక్కుంటాం. విడిపోయిన ప్రియుడు మళ్లీ తన దారిలోకి వచ్చాడని భావించి.. ఓ యువతి అతడికి అర్ధనగ్న ఫొటోలు పంపి చిక్కుల్లో పడింది. ఓ రోజు నేరుగా కలుసుకోగా, అసలు విషయం అర్థమైంది. తాను పొరపాటున మరో వ్యక్తికి ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పంపించానని తెలుసుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన వద్ద ఉన్న ప్రైవేట్ ఫొటోలు, వీడియోలతో యువతిని నిందితుడు వేధింపులకు గురిచేశాడు. చివరగా షీ టీమ్‌ను ఆశ్రయించడంతో ఆమెకు న్యాయం జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి..


పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ శివారులోని శివరాంపల్లి (అరాంఘర్)లో నివాసముంటే మహ్మద్ మొహ్సీన్ (22) పెయింటర్. ఇతడి స్నేహితుడు గతంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ ఏదో కారణంతో వాళ్లు విడిపోయారని మొహ్సీన్‌ తెలుసుకున్నాడు. ఇదే ఛాన్స్ అనుకుని యువతితో సోషల్ మీడియా ద్వారా మాటలు కలిపాడు. తాను రాజు అని చెప్పి, ఇకనుంచి ఏ వివాదాలు లేకుండా హాయిగా ఉందామని చెప్పి యువతిని తన మాయమాటలతో నమ్మించాడు. సెల్ ఫోన్ నెంబర్లు సైతం మళ్లీ ఇచ్చి పుచ్చుకున్నాడు. తరచుగా వీళ్లు ఫోన్ చేసి మాట్లాడుకునేవారు. వ్యక్తిగత విషయాలు కూడా యువతి తన ప్రియుడిగా భావించిన యువకుడితో షేర్ చేసుకుంది.


ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు పంపిన యువతి..
తాను నిత్యం ఫోన్‌లో మాట్లాడుతున్నది, సోషల్ మీడియాలో ఛాటింగ్ చేసేది ప్రియుడే కదా అని పూర్తిగా నమ్మింది యువతి. ఇదే అదనుగా చేసుకుని తనకు అర్ధనగ్న ఫొటోలు, వీడియోలు పంపాలని ఒత్తిడి తేగా, ప్రియుడి కోరిక మేరకు యువతి తన ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పంపించింది. ఓరోజు ఇద్దరూ కలుసుకోగా, అతడు తన లవర్ కాదని గ్రహించిన యువతి.. తాను మోసపోయానని తెలుసుకుంది. తన ప్రైవేట్ ఫొటోలు డిలీట్ చేయాలని రాజుగా పరిచయం చేసుకున్న మొహ్సీన్‌ను కోరింది. కానీ అతడు తన బుద్ధి చూపించాడు. అలా చేయాలంటే తనకు డబ్బులు ఇవ్వాలని, లేకపోతే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయానంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.  


షీట్ టీమ్స్‌ను ఆశ్రయించిన బాధితురాలు..
తన వ్యక్తిగత ఫొటోలు డిలీట్ చేయడానికి బదులుగా వేధింపులకు పాల్పడుతుండటంతో షీ టీమ్స్‌ను ఆశ్రయించింది బాధిత యువతి. ఆమె ఫిర్యాదు, అందించిన వివరాలతో మొహ్సీన్‌పై సెక్షన్ 385,354 ఐపిసి, 67ఏ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా తన తప్పిదాన్ని నిందితుడు అంగీకరించాడు. అనంతరం మలక్ పేట పోలీస్ స్టేషన్లో నిందితుడ్ని అప్పగించారు.
Also Read: Uppal News : పెళ్లైన యువకుడికి బలవంతపు పెళ్లి, నెట్టింట వీడియో వైరల్ 


Also Read: Parvatipuram Crime News : ప్రాణానికి ప్రాణం తీర్పు చెప్పిన పంచాయతీ పెద్దలు, మతిస్థిమితం లేని వ్యక్తి దారుణ హత్య