వైద్య సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు.. మానవ భవిష్యత్తునే మార్చేయనున్నాయి. శరీరంలో ఏ చిన్న సమస్య వచ్చినా సులభంగా తెలుసుకోడానికి అనేక వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మానవ అవయవాలను కూడా సృష్టించగలిగే టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. ఎందుకంటే, ఇప్పటికే వైద్యులు మానవ కణాలతో 3D బయో అవయవాలను సృష్టిస్తున్నారు. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం. 


మెక్సికోకు చెందిన 20 ఏళ్ల యువతికి పుట్టుక నుంచే చెవి లేదు. మైక్రోటియా(Microtia) అనే సమస్య వల్ల ఆమె చెవి పూర్తిగా ఎదగలేదు. దీంతో ఆ భాగం పూర్తిగా మూసుకుపోయింది. ఆ చెవిని చూసి ఆమె తోటి పిల్లలు ఎగతాళి చేసేవారు. ఈ నేపథ్యంలో ఆమె ఎంతోమంది వైద్యులను సంప్రదించింది. కానీ, ఫలితం దక్కలేదు. ఇక తన జీవితం అంతే అనుకుంటున్న సమయంలో క్వీన్స్‌లోని రీజెనరేటివ్ మెడిసిన్ కంపెనీ ఆమె సమస్యకు పరిష్కారం చూపింది. 


ఆమె నుంచే కణాలను సేకరించి కొత్త చెవిని సృష్టించింది. ఆ తర్వాత ఆమెకు చెవి మార్పిడి చికిత్స నిర్వహించి.. 3D బయో ఇయర్‌ను అమర్చారు. ఇది చూసేందుకు అచ్చం సహజమైన చెవిలాగానే ఉండటం గమనార్హం. దాన్ని తాకినప్పుడు అచ్చం నిజమైన చర్మాన్ని తాకినట్లే ఉందని ఆ యువతి కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.


మైక్రోటియా అనేది పుట్టకతోనే వచ్చే వ్యాధి. దీనివల్ల శరీరంలోని కొన్ని అవయవాలు సహజ రూపంలో ఏర్పడవు. అందుకే, ఆ యువతి చెవికి సరైన రూపం ఏర్పడలేదు. ఈ నేపథ్యంలో నిపుణులు 3D బయో ప్రింటెడ్ లివింగ్ టిష్యూ ఇయర్ ఇంప్లాంట్ (AuriNovo) ఉపయోగించి చెవిని సృష్టించారు. ఇది ఆమె శరీరంలోకి ఇమిడిపోయింది. కాలక్రమేనా అది చర్మంతో కలిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. 


Also Read: నా భార్య రోజూ మ్యాగీ పెట్టి చంపేస్తోంది - కోర్టుకు భర్త మొర, చివరికి..


టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలోని మైక్రోటియా-కంజెనిటల్ ఇయర్ డిఫార్మిటీ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆర్టురో బోనిల్లా ఈ ప్రక్రియకు నాయకత్వం వహించారు. చెవి మార్పిడి చికిత్స విజయవంతమైన నేపథ్యంలో. భవిష్యత్తులో వైకల్యంతో పుట్టే చిన్నారుల సమస్యలను పరిష్కరించడం సాధ్యమవుతుందని బోనిల్లా ఈ సందర్భంగా తెలిపారు. ఈ విధానంలో రోగి మృదులాస్థి కణాలను ఉపయోగించి చెవిని పునర్నిర్మించామని తెలిపారు. భవిష్యత్తులో ముక్కు, వెన్నెముక సమస్యలను కూడా ఈ ప్రక్రియతో పరిష్కరించవచ్చని పేర్కొన్నారు.  


Also Read: కక్కుర్తి పడితే ఇంతే, ఆ ఫుడ్ కోసం తమ పేర్లను ఫన్నీగా మార్చుకున్న జనం, షాకిచ్చిన ప్రభుత్వం