అక్కినేని నాగచైతన్య మాస్కోలో ఉన్నారు. రష్యా రాజధానిలో, విపరీతమైన చలిలో తిరుగుతున్నారు. ఒకవైపు ఇండియాలో సమంతతో ఆయన విడాకులు మీద వేడి వేడి చర్చ జరుగుతోంది. మరి, ఆయన ఎక్కడ ఏం చేస్తున్నారో తెలుసా? షూటింగ్ చేస్తున్నారు. వివాదాలకు దూరంగా తన పని తాను చేసుకుంటున్నారు.


అక్కినేని కుటుంబంలో మూడు తరాల హీరోలతో 'మనం' వంటి మంచి సినిమా తీసిన దర్శకుడు విక్రమ్ కె. కుమార్. ఆయన దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న తాజా సినిమా 'థాంక్యూ'. ప్రస్తుతం మాస్కోలో షూటింగ్ చేస్తున్నారు. హీరోయిన్ రాశీ ఖన్నా, నటుడు ప్రకాష్ రాజ్ తదితరులు కూడా మాస్కో వెళ్లారు. ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. జనవరి 26న  సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ పుట్టినరోజును కూడా అక్కడే సెలబ్రేట్ చేశారు.


మాస్కో షెడ్యూల్‌లో నాగచైతన్య, రాశీ ఖన్నాపై ఓ పాటను కూడా షూటింగ్ చేసినట్టు తెలిసింది. ఈ షెడ్యూల్ దాదాపు చివరకు వచ్చినట్టు సమాచారం. త్వరలో టీమ్ అందరూ ఇండియాకు రానున్నారు. ఈ సినిమాలో అవికా గోర్, మాళవికా నాయర్ మరో ఇద్దరు హీరోయిన్లు. ఈ సినిమాకు బీవీఎస్ రవి కథ అందించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.