తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా మార్మోగించిన చిత్రం ‘RRR’. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో ‘నాటు నాటు’ పాట, మార్చి 12న అమెరికాలో జరిగిన ఆస్కార్ వేడుకల్లో బంగారు అకాడమీ అవార్డును అందుకుంది. లిరిసిస్ట్ చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి జంటగా ఈ అవార్డులను స్వీకరించారు. తెలుగు సినిమా తొలిసారి ఆస్కార్ సాధించి, భారతీయ సినీ పరిశ్రమలో సంచలనం కలిగించింది. దర్శకుడు రాజమౌళితో పాటు నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాకు ఆస్కార్ రావడం పట్ల ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రుల వరకు అందరూ అభినందనలు తెలిపారు.
‘RRR’ సినిమాలో అజయ్ కీలకపాత్ర
ఇక ఈ చారిత్రాత్మక సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కీలకపాత్ర పోషించారు. రామరాజు తండ్రిగా, బ్రిటీష్ పాలకులపై కొట్లాడే పోరాటయోధులను తయారు చేసే నాయకుడిగా పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు. ప్రస్తుతం ఆయన ‘భోళా’ అనే సినిమా చేస్తున్నారు. కార్తీ తమిళ మూవీ ‘ఖైదీ’ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. లోకేష్ కనకరాజ్, కార్తీ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం సౌత్ లో సూపర్ హిట్ గా నిలిచింది. అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ప్రస్తుతం అజయ్ ‘భోళా’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే నటి టబుతో కలిసి కపిల్ శర్మ కామెడీ షోలో పాల్గొన్నారు.
నా వల్లే ‘RRR’ సినిమాకు ఆస్కార్- అజయ్ దేవగన్
ఈ సందర్భంగా ‘RRR’ సినిమాకు ఆస్కార్ రావడం గురించి కపిల్ శర్మ స్పందించారు. అజయ్ దేవగన్ కు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా అజయ్ దేవగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు తన వల్లే ఆస్కార్ అవార్డు వచ్చిందన్నారు. అజయ్ మాటలకు ఆశ్చర్యపోయిన కపిల్, ఎలాగో చెప్పాలన్నారు. ‘నాటు నాటు’ పాటకు తాను డ్యాన్స్ చేయలేదని, ఒకవేళ వేసి ఉంటే ఆస్కార్ వరకు వెళ్లేది కాదన్నారు. దీంతో షో అంతా నవ్వులతో నిండిపోయింది. ప్రస్తుతం అజయ్ దేవగన్ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
అజయ్ ఆశలన్నీ ఈ సినిమా పైనే!
ఇక ‘భోళా’ సినిమా ఈ నెల 30న విడుదలను రెడీ అవుతోంది. అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో టబు కీలకపాత్ర పోషిస్తోంది. సౌత్ సూపర్ హిట్ ‘ఖైదీ’ రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తన ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలో మార్పులు చేసి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు దేవగన్. కొంతకాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న ఆయన, ఈ సినిమాపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ తనకు ఏరేంజిలో సక్సెస్ అందిస్తుందో చూడాలి.
Read Also: బేబీ జాక్వెలిన్, నిన్నుచాలా మిస్ అవుతున్నా! జైలు నుంచి సుకేష్ మరో ప్రేమలేఖ!