తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'జై భీమ్', అల్లరి నరేష్ నటించిన 'నాంది' సినిమాలకు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ప్రతి ఏడాది జరిగే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఈసారి కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. 12వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ ను ఇటీవల నిర్వహించగా.. ఇందులో 'జై భీమ్', 'నాంది' సినిమాలకు అవార్డులు వచ్చాయి.
సూర్య సినిమాకు రెండు కేటగిరీల్లో అవార్డులు రాగా.. 'నాంది' సినిమాకి ఒక అవార్డు దక్కింది. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విజయ్ కనకమేడలకు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా అవార్డుని అందించారు. దీంతో 'నాంది' చిత్ర యూనిట్, పలువురు సినీ ప్రముఖులు విజయ్ కి అభినందనలు తెలుపుతున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా 2021 ఫిబ్రవరి నెలలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
చాలా కాలం తరువాత ఈ సినిమాతో హిట్ అందుకున్నారు అల్లరి నరేష్. తన కామెడీ జోనర్ ను పక్కన పెట్టి సీరియస్ ఫిలింలో నటించారు. ఎలాంటి తప్పు చేయని హీరోని ఓ కేసులో కావాలనే ఇరికించి జైల్లో పెడతారు. ఆ తరువాత ఏం జరిగిందనే విషయాలను ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్ర పోషించింది.
Also Read: 'ఎఫ్3' ట్రైలర్ డబ్బింగ్ పూర్తి చేసిన వెంకీ - ఫ్యాన్స్ రెడీనా?