టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపేందుకు సినీ ప్రముఖులు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, ఆర్.నారాయణ మూర్తి, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ తదితరులు గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. చర్చల తర్వాత సీఎం సానుకూలంగా స్పందించడంతో టాలీవుడ్ బృందం ఆనందానికి అవథుల్లేవు. సాధారణంగా ఇలాంటి చర్చల్లో మహేష్ బాబు, ప్రభాస్‌లు పెద్దగా పాల్గోరు. కానీ, తొలిసారి టాలీవుడ్ కోసం చిరంజీవితో కలిసి ముందడుగు వేశారు. అయితే, ఈ సమావేశంలో నాగార్జున, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మోహన్ బాబు, మంచు విష్ణు వెళ్లకపోవడం చర్చనీయమైంది.


చిరు సర్‌ప్రైజ్‌పై మహేష్ బాబు స్పందన: సీఎంను కలిసేందుకు టాలీవుడ్ ప్రముఖులంతా ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లారు. ఈ రోజు (10.02.2022) మహేష్ బాబు- నమ్రతాల పెళ్లి రోజు కూడా కావడంతో చిరంజీవి తదితరులు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ సూపర్ స్టార్‌‌ను సర్‌ప్రైజ్ చేశారు. అనంతరం మహేష్, నమ్రతాలకు విషెస్ చేస్తూ ఫొటోను ట్వీట్ చేశారు. దీనిపై మహేష్ బాబు ట్వి్ట్టర్ ద్వారా స్పందించారు. ‘‘ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ రోజును మరింత ప్రత్యేకంగా మార్చిన చిరంజీవి సార్‌కు ధన్యవాదాలు’’ అని తెలిపారు.  






జగన్‌కు ధన్యవాదాలు: ఆ తర్వాత మహేష్ బాబు టాలీవుడ్ సమస్యలపై స్పందించిన సీఎం జగన్‌కు, సినీ పరిశ్రమకు నాయకత్వం వహించిన చిరంజీవికి ధన్యవాదాలు తెలుపుతూ మరికొన్ని ట్వీట్లు చేశారు. ‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్నందుకు, టాలీవుడ్ అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి  గారికి ధన్యవాదాలు’’ అని తెలిపారు.  






‘‘మిమ్మల్ని(సీఎం జగన్) కలవడం, మా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీరు తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీరు చక్కటి సమతుల్యతతో పరిష్కారాన్ని కనుగొంటారని ఆశిస్తున్నాం’’ అని మరో ట్వీట్లో పేర్కొన్నారు. ‘‘మాకు నాయకత్వం వహించిన చిరంజీవి సర్‌కు, ఈ సమావేశానికి అవకాశం కల్పించిన పేర్ని నానిగారికి హృదయపూర్వక కృత‌జ్ఞతలు’’ అని తెలిపారు. 


Also Read: ఐదు షోలు, టిక్కెట్ రేట్ల పెంపు, విశాఖలో స్థలాలు, టాలీవుడ్ ప్రముఖులకు జగన్ వరాలు