చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖులతో సమావేశమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ( AP CM Jagan ) సినీ పరిశ్రమకు ఉపయోగపడే మంచి పాలసీ తీసుకు వస్తామని భరోస ఇచ్చారు. పెద్ద , చిన్న సినిమాలకు ఉపయోగపడే విధంగా ఆ పాలసీ ఉండేలా కసరత్తు చేస్తున్నామని తెలిపారు. 


పెద్ద సినిమాలకు వారం పాటు ధరలు పెంచుకునేందుకు అనుమతి !


పెద్ద సినిమాలకు ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం  అలాంటి చాన్సే లేదని చెబుతూ వస్తోంది. ఇప్పుడు మాత్రం సినీ ప్రముఖులతో  ( Tollywood ) సీఎం జగన్ ధరల పెంపు గురించి చెప్పారు.    హీరో, హీరోయిన్‌, దర్శకుడు పారితోషికం వంటి అంశాలతో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారని..  అటువంటి సినిమాలను ప్రత్యేకంగా చూడాలని జగన్ అన్నారు. లేకపోతే భారీ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, ఖర్చుతో చేయడానికి ఎవరూ ముందుకు రాన్నారు. అందుకే అలాంటి సినిమాలకు వారం పాటు ధరల పెంచుకునేందుకు అనుమతి ఇస్తామన్నారు.  


 ఐదో షోకు కూడా అనుమతి !


ఇప్పటి వరకూ ఐదో షోకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని చెబుతూ వస్తున్న సీఎం జగన్ సినీ ప్రముఖుల భేటీలో మాత్రం ఐదో షోకు అనుమతి ఇస్తున్నట్లుగా తెలిపారు. ఐదో షో కూడా తీసుకురావాలని అడిగారని.. ఆ పాయింట్‌ను అర్థం చేసుకున్నామన్నారు.అది అందరికీ వర్తిస్తుంది. చిన్న సినిమాలకూ అవే రేట్లు వర్తిస్తాయి. వారికి కూడా మంచి ఆదాయాలు వస్తాయి. ఐదో ఆట వల్ల పరిశ్రమకు మేలు జరుగుతుందని జగన్ వ్యాఖ్యానించారు.  


 20 శాతం షూటింగ్ ఏపీలో చేయాలనే నిబంధన  !


తెలంగాణతో పోలిస్తే సినీ పరిశ్రమకు ఆంధ్రా ( Andhra ) నుంచే ఎక్కువ ఆదాయం వస్తోందని సీఎం జగన్ తలిపారు. తెలంగాణ 35-40 శాతం అయితే. ఆంధ్రా 60 శాతం వరకు ఆదాయం వస్తోందన్నారు. ఏపీలో జనాభా, ప్రేక్షకులు, థియేటర్లు ఎక్కువ. ఆదాయపరంగానూ ఏపీ నుంచి ఎక్కువగా వస్తుందని దానికి తగ్గట్లుగా  రాష్ట్రంలో షూటింగులు ప్రమోట్‌ చేయాల్సినఅసరం ఉందన్నారు. కనీసం 20 శాతం షూటింగ్ ఏపీలో జరగేలా నిబంధనలు పెడతామని జగన్ సూచన ప్రాయంగా చెప్పారు. 


విశాఖలో జూబ్లిహిల్స్‌ను సృష్టిద్దామన్న జగన్  !


సినీ పరిశ్రమ స్టూడియోలు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తే విశాఖలో ( Vizag ) స్థలాలు ఇస్తామని సీఎం జగన్ తెలిపారు.. అక్కడ జూబ్లీహిల్స్‌ తరహా ప్రాంతాన్ని క్రియేట్‌ చేద్దామని పిలుపునిచ్చారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌తో విశాఖ పోటీపడగలదు. మనం ఓన్‌ చేసుకోవాలి. మనందరం అక్కడికి వెళ్లాలన్నారు. ముందడుగు పడాలంటే సినీ పరిశ్రమ ముందుకు రావాలన్నారు. అందరికీ ఇళ్ల స్థలాలతో పాటు స్టూడియోలకు కూడా స్థలాలు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు.