Megastar Chiranjeevi Rare Photo: మెగాస్టార్ చిరంజీవి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఏడు పదుల వయసు దగ్గర పడుతున్నా ఏమాత్రం గ్రేస్ తగ్గలేదు. కుర్ర హీరోలతో పోటీ పడి సినిమాలు చేస్తున్నారు. ఇక చిరంజీవి తరచుగా తన జీవితంలోని మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. అప్పుడప్పుడు అరుదైన ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. తన బాల్యానికి సంబంధించిన విషయాలతో పాటు చదువు, సినిమాలకు సంబంధించి ఎవరికీ తెలియని విషయాలను చెప్తుంటారు. తాజాగా చిరు ఓ రేర్ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటో వెనుకున్న కథ ఏంటో వివరించారు.


50 ఏండ్ల జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న చిరంజీవి


తాజాగా చిరంజీవి షేర్ చేసి ఫోటో నరసాపురంలోని వై.ఎన్‌.ఎం కాలేజీలో  డిగ్రీ చదువుతున్న రోజుల్లో తీసుకున్నట్లు చెప్పారు. రంగస్థలం మీద తొలి నాటకం వేసి సందర్భంగా ఈ ఫోటోను దిగినట్లు వివరించారు. తన నట జీవితానికి పునాది రాయి పడింది అక్కడే అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. “రాజీనామా’  కాలేజీలో  రంగస్థలం  మీద వేసిన తొలి నాటకం. కోన గోవిందరావు ఈ నాటకాన్ని రచించారు. నటుడిగా తొలి గుర్తింపు తెచ్చిన నాటకం ఇది. ఉత్తమ నటుడిగా అవార్డును అందించింది. ఎనలేని ప్రోత్సాహం కలిగించింది. 1974 నుంచి 2024 వరకు 50 సంవత్సరాల నట ప్రస్థానంలో ఎనలేని ఆనందానికి కారణం అయ్యింది’’ అంటూ చిరంజీవి ఇన్ స్టా వేదికగా రాసుకొచ్చారు. చిరంజీవి షేర్ చేసిన ఫోటో చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కుష్బూ లాంటి పలువురు సినీ తారలు ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ పోస్టులు పెడుతున్నారు.   






రంగస్థలం నుంచి సినిమా పరిశ్రమలోకి..


మెగాస్టార్ చిరంజీవి డిగ్రీ చదువుతున్న రోజుల నుంచే నాటక రంగం మీద ఎంతో ఆసక్తి ఉండేది. అప్పటి నుంచే రంగస్థలం మీద నాటకాలు వేసేశారు. ఆయన ఏ పాత్ర చేసినా ఇట్టే ఒదిగిపోయి నటించేవారు. ఆయన పాల్గొన్న ప్రతి నాటకంలోనూ తనకే మొదటి బహుమతి వచ్చేది. కాలేజీ రోజులు పూర్తి కాగానే సినిమాల్లో ప్రయత్నించారు. 'పునాది రాళ్లు’ సినిమాలో తొలి అవకాశం ఉంది. 1978లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఆయన నటించిన సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటూ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో నిలబెట్టాయి.    


వచ్చే ఏడాది వేసవిలో ‘విశ్వంభర’ విడుదల


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. యు.వి క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అవుతుందని ముందుగా మేకర్స్ ప్రకటించినా, ఆ తర్వాత ఈ సినిమాను వేసవికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమా స్థానంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ విడుదలకు రెడీ అవుతోంది.


Read Also: జ్యోతికతో సినిమా, సిగ్గు పడుతూ సూర్య చెప్పిన సమాధానం ఏంటో తెలుసా?