AP EAPCET 2024 Engineering Counseling: ఏపీలో ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులలో మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించి నాలుగో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై అక్టోబరు 25న హైకోర్టులో విచారణ జరిగింది. కౌన్సెలింగ్ నిర్వహణపై 10 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఏపీఈఏపీ సెట్-2024 కన్వీనర్‌తోపాటు ఇతర అధికారులను హైకోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.రాజశేఖరరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేస్తూ.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. 


ఇంజినీరింగ్‌లో మిగిలిన సీట్ల భర్తీకి నాలుగో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీచేయాలంటూ.. విజయవాడకు చెందిన ఓ విద్యార్థి తల్లి పలగర అనసూర్య హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. అక్టోబరు 25న జరిగిన విచారణలో పిటిషనర్ తరఫున న్యాయవాది పాలేటి మహేశ్వరరావు వాదనలు వినిపించారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో సుమారు 25 వేల సీట్లు మిగిలిపోయాయని తెలిపారు. 


కౌన్సెలింగ్‌ సమయంలో ఏపీలోని పల ప్రాంతాల్లో వరదలు సంభవించాయని, వరదల కారణంగా తన కుమారుడితోపాటు, పలువురు విద్యార్థులు ప్రవేశాలు పొందలేకపోయారని, తమకు నచ్చిన బ్రాంచ్‌ల్లో సీట్లు పొందలేకపోయారని ఆమె తెలిపారు. మిగిలిన సీట్లను నాలుగో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయాలని కోరుతూ అక్టోబరు 11న ఇచ్చిన వినతిపై అధికారులు నిర్ణయం తీసుకోలేదని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చర్యలు తీసుకోలేదని, అందుకే కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. వినతిపై నిర్ణయం తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ మేరకు అక్టోబరు 24న హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిగిన న్యాయస్థానం 10 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. 


డిప్లొమా మార్కులతో ‘బీటెక్‌’ సీట్ల భర్తీ..
పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్హతతో ఉద్యోగాలు చేస్తూ.. ఉన్నత బీటెక్ చదువుకోవాలనుకునే వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు జేఎన్‌టీయూ హైదరాబాద్ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు సాయంత్రం వేళల్లో బీటెక్ కోర్సుల నిర్వహణకు జేఎన్‌టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాలతోపాటు మరో 8 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలకు జేఎన్‌టీయూహెచ్ అనుమతి ఇచ్చింది. ఆయాకళాశాలల స్ధాయిని బట్టి ఫీజును నిర్ణయించారు. కోర్సు ఫీజు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు నిర్ణయించారు. ఈ బీటెక్ ప్రవేశాలకు సంబంధించి త్వరలోనే 'స్పాట్ అడ్మిషన్' నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో స్పాట్ ప్రవేశాల నోటిఫికేషన్‌కు ఏర్పాట్లు చేశామని డైరెక్టర్ ప్రొఫెసర్ కృష్ణమోహన్ రావు తెలిపారు.   
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ


'టెన్త్' విద్యార్థులకు అలర్ట్, పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూలు వెల్లడి - ముఖ్యమైన తేదీలవే
ఏపీలో పదోతరగతి పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం విద్యార్థులు అక్టోబరు 28 నుంచి నవంబరు 11 వరకు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులకు ఆలస్య రుసుముతో  ఫీజు చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. విద్యార్థులు రూ.50 ఆలస్యరుసుముతో నవంబరు 12 నుంచి నవంబరు 18 వరకు, రూ.200 ఆలస్యరుసుముతో నవంబరు 19 నుంచి 25 వరకు, రూ.500 ఆలస్యరుసుముతో  నవంబరు 26 నుంచి నవంబరు 30 వరకు ఫీజు చెల్లించవచ్చు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..