Suriya-Jyothika Movie: దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ కపుల్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సూర్య, జ్యోతిక. తమిళ సినిమా పరిశ్రమలో ఈ జంటకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. పెళ్లికి ముందుకు ఇద్దరు కలిసి పలు సినిమాల్లో నటించారు. 1999లో ‘పూవెల్లామ్ కేట్టుప్పార్’ సినిమాతో తొలిసారి జంటగా ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత పలు  సినిమాల్లో నటించారు.  చివరిగా 2006లో ‘సిల్లును ఒరు కాదల్’ చిత్రంలో కనిపించారు. అదే సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరికి ఓపాప, ఓ బాబు ఉన్నారు. పెళ్లి తర్వాత ఇద్దరు పలు సినిమాల్లో నటించినా, కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. వీరిద్దరు  జంటగా ఓ సినిమా చేస్తే బాగుంటుందని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అడిగితే, సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.


కథ డిమాండ్ చేస్తే తప్పకుండా చేస్తాం- సూర్య


‘కంగువా’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య, తన భార్య జ్యోతికతో కలిసి నటించడం గురించి కీలక విషయాలు చెప్పారు. కథ డిమాండ్ చేస్తే తప్పకుండా కలిసి నటిస్తామన్నారు. “నా భార్యతో కలిసి నటించడం నాకూ చాలా ఇష్టంగానే ఉంది. తుది నిర్ణయం అనేది దర్శక నిర్మాతల మీద ఆధారపడి ఉంటుంది. కథ డిమాండ్ చేస్తే తప్పకుండా కలిసి నటిస్తాం. సినిమా అనేది ఆర్గానిక్ వేలో ఉండాలి. కావాలని నటించేలా చేసినట్లు ఉండకూడదు. రీమేక్ సినిమానా? కొత్త కథా? అనేది ముఖ్యం కాదు. ఇద్దరికి సరిపోయే కథ అయితే చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు” అని సూర్య చెప్పుకొచ్చారు. నిజానికి గత కొద్ది కాలంగా జ్యోతిక, సూర్య కలిసి సినిమా చేస్తున్నట్లు ఇండస్ట్రీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓ మహిళా దర్శకురాలు వీరి సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ అదే నిజం అయితే, పెళ్లి తర్వాత ఈ దంపతులు కలిసి చేసే తొలి సినిమా ఇదే అవుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  


నవంబర్ 14న ‘కంగువా’ సినిమా విడుదల


తాజాగా సూర్య హీరోగా తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘కంగువా’ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తన అద్భుతమైన నటనతో సూర్య మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతున్నారు. సుమారు 100 సంవత్సరాల క్రితం పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన్నట్లు ఇప్పటికే సూర్య చెప్పుకొచ్చారు. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నారు. జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సుమారు 35 భాషల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా విడుదలకాబోతోంది.    


Read Also: పగటిపూట 3 గంటలకే చీకటి పడే వింత ఊరు... క్యూరియాసిటీని పెంచేస్తోన్న 'క' ట్రైలర్