మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi).. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు. తన నటన, డాన్స్, యాక్షన్ తో కోట్లాది మందిని అభిమానులుగా మార్చుకున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన చిరు.. ఈరోజు ఎందరికో ఆదర్శంగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినిమా 'ప్రాణం ఖరీదు'. ఈ సినిమా విడుదలైన ఈరోజుకి 44 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా చిరు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
'మీకు తెలిసిన ఈ చిరంజీవి.. చిరంజీవిగా పుట్టిన రోజు.. ఈ రోజు 22 సెప్టెంబర్ 1978. ప్రాణం ఖరీదు సినిమా ద్వారా ప్రాణం పోసి.. ప్రాణపదంగా, నా ఊపిరై.. నా గుండె చప్పుడై.. అన్నీ మీరై 44 సంవత్సరాలు నన్న నడిపించారు. నన్నింతగా ఆదరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను.. ఎప్పటికీ మీ చిరంజీవి..' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మలయాళ 'లూసిఫర్'కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార(Nayanthara), సత్యదేవ్(Satyadev) లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కథ ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇందులో క్యామియో రోల్ పోషిస్తున్నారు. చిరంజీవికి బాడీగార్డ్ లా కనిపించే రోల్ ఇది. కానీ సినిమా మొత్తం సల్మాన్ కనిపించరు. ఒక యాక్షన్ సీన్ లో ఆయన క్యారెక్టర్ ని హైలైట్ చేసి చూపించబోతున్నారు.
ఈ సినిమాతో పాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరు. దానికి 'వాల్తేర్ వీరయ్య' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే మరికొంతమంది స్టార్స్ ను తీసుకున్నారు. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నారు.
కథ ప్రకారం.. చిరు, రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నారు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఈ సినిమా ఉంటుందట. పూర్తి మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు. తెరపై చిరంజీవి, రవితేజ మధ్య వచ్చే క్లాష్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.
Also Read: క్రియేటివిటీకి కళ్లజోడు పెడితే.. సింగీతం శ్రీనివాసరావు