Maya Bazaar For Sale: గత కొన్నేళ్లగా ఓటీటీల హవా జోరుగా సాగుతోంది. సినిమా థియేటర్లతో పోటీగా కొత్త కొత్త కంటెంట్ లను ప్రోత్సహించడంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ముందుంటోంది. దీంతో ఓటీటీ వేదికగా సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. మేకర్స్ కూడా ఓటీటీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త కంటెంట్ ను రెడీ చేస్తున్నారు. తాజాగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ‘మాయా బజార్ ఫర్ సేల్’ అనే వెబ్ సిరీస్ రానుంది. గేటెడ్ కమ్యూనిటీలలో ఉండే కుటుంబాలలో ఉండే ఇంట్రస్టింగ్ అంశాల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ఉండనున్నట్టు తెలుస్తోంది.
రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యానర్ సహకారంతో..
భారతదేశంలో ఉన్న ప్రముఖ వెబ్ సిరీస్ లలో జీ5 కూడా ఒకటి. ప్రేక్షకుల అభిలాషకు తగ్గట్టు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో ఆడియన్స్ ను అలరిస్తోన్న ఈ సంస్థ ఇప్పుడు మరో వెబ్ సిరీస్ ను ఓటీటీ లవర్స్ కోసం తీసుకురానుంది. ‘మాయాబజార్ ఫర్ సేల్’ అనే వెబ్ సిరీస్ ను టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటికి సంబంధించిన ‘స్పిరిట్ మీడియా బ్యానర్’ తో కలసి రూపొందిస్తోంది జీ5. రానా దగ్గుబాటి ఓ వైపు సినిమాలు చేస్తూనే, కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ను కూడా ఏర్పాటు చేశారు. దాని ద్వారానే ఈ వెబ్ సిరీస్ కు సహ నిర్మాతగా వ్యవహరించారు రానా. గౌతమి చల్లగుల్ల ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తోంది. ఇందులో నవదీప్, ఈషా రెబ్బా, హరితేజ, నరేష్ విజయ్ కుమార్, ఝాన్సీ లక్ష్మీ, కోట శ్రీనివాసరావు, మియాంగ్ చంగ్, సునైన పలువురు ప్రధాన పాత్రల్లో నటించారు.
గేటెడ్ కమ్యూనిటీ కుటుంబాల కథతో..
ఓటీటీలు వచ్చిన తర్వాత కొత్త టాలెంట్ కు చాలా అవకాశాలు వస్తున్నాయి. విభిన్నమైన కథలతో తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిందే ఈ ‘మాయాబజార్ ఫర్ సేల్’. ఇక ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే.. ఓ గేటెడ్ కమ్యూనిటీలో కొన్ని కుటుంబాలు హాయిగా నివాసం ఉంటారు. అయితే ఆ గేటెడ్ కమ్యూనిటీ అక్రమ నిర్మాణం అని, దాన్ని కూల్చివేయాలని ప్రభుత్వం చెబుతుంది. అందుకోసం కూల్చివేత యంత్రాలను కూడా పంపుతుంది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలు ఆ పరిస్థితులన్ని ఎలా ఎదుర్కున్నాయి. ఆ సమస్యను వాళ్లు ఎలా పరిష్కరించుకున్నారు అనేది సిరీస్ లో చూడొచ్చు. ప్రత్యేకంగా మోడరన్ సొసైటీలో ఫ్యామిలీస్ ఎలా ఉంటున్నాయి? సామాజిక జీవన విధానం ఎలా ఉంటుందనే కోణంలో సైటరికల్ గా ఈ సిరీస్ తెరకెక్కించారట మేకర్స్. ఈ సిరీస్ చూస్తే ప్రతి ఒక్కరూ తమని తాము ఊహించుకుంటారని, కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ అందరికీ నచ్చుతుందని చెబుతున్నారు మేకర్స్. అయితే విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ఆడియన్స్ ను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. రాజీవ్ రంజన్ నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ జూలై 14 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Also Read: విజయ్ ఆంటోనీ ‘హత్య’కు డేట్ ఫిక్స్ - మరీ ఇంత స్పీడా?