RIMS Hospital RMO: శ్రీకాకుళం రిమ్స్ ఆర్ఎంఓ శంకర్ రావు.. తానొక వైద్యాధికారినని మరిచిపోయి మరీ రెచ్చిపోయారు. మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించి వీరంగం సృష్టించారు. అసభ్య పదజాలం వాడుతూ.. జర్నలిస్టులపై నోరు పారేసుకున్నారు. అలాగే తొడకొడుతూ ఏం చేసుకుంటారో చేసుకోండంటూ పెట్రేగిపోయారు. చివరకు మహిళా పారిశుద్ధ్య కార్మికులు సైతం ఆర్ఎంఓ శంకర్ రావు తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. తమతోనూ అసభ్యకర మాటలు, చేష్టలతో ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఇలాంటి వ్యక్తి ఆస్పత్రిలో ఉంటే పనిచేయలేమంటూ ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
జిల్లాలోని ఎచ్చెర్ల మండలం కుప్పిలిలో ఓ తండ్రి కన్న కొడుకునే అతి కిరాతకంగా నరికి చంపేశాడు. మిగతా కుటుంబ సభ్యులనూ చంపేందుకు ప్రయత్నించాడు. కానీ వారంతా గట్టిగా కేకలు వేయగా.. స్థానికులు వచ్చారు. దీంతో నిందితుడు పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన పెద్ద కుమారుడు తాతారావు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. అయితే తండ్రి కుమారుడిని చంపడానికి కారణం.. ఆయన భార్యేనని పోలీసులు భావిస్తున్నారు. అర్ధరాత్రి జరిగిన ఘటన.. స్థానికంగా కలకలం రేపింది. అయితే స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. అయితే ఈ ఘటనను చిత్రీకరించేందుకు మీడియా ప్రతినిధులు అంతా ఆస్పత్రికి వెళ్లారు.
కానీ ఆస్పత్రిలో ఉన్న ఆర్‌ఎంఓ శంకర్ రావు.. మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపలికి రానివ్వనంటూ అసభ్య పదజాలంతో దూషించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించనంటూ.. మీడియాను పోలీసులతో అడ్డగించారు. వారి ముందే గేటు వద్ద నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఏం చేసుకుంటారో చేసుకొండంటూ తొడకొడుతూ మీడియా ప్రతినిధులను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లా వాసులు వెనుకబడినవారంటూ దూషించారు. తనను ఎవరూ ఏం చేయలేరంటూ విర్రవీగారు. ఆర్ఎంఓ ప్రవర్తనపై మీడియా ప్రతినిధులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial