పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ ఫిల్మ్ 'హరి హర వీర మల్లు'. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినా, ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. సుమారు 75 శాతం షూటింగ్ పూర్తి కాగా, 25 శాతం పెండింగ్ లో ఉంది. ఈ సినిమా కంప్లీట్ కావాలంటే కనీసం నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ‘, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్, సాయి ధరమ్ తేజ్‌తో ఒక చిత్రం చేస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమాలకు సంబంధించిన ఒకటి రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ‘హరిహర వీరమల్లు’ కంప్లీట్ చేయాలి అనుకున్నారు పవన్.


అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన ‘హరిహర వీరమల్లు’ సెట్


త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పవన్ పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అనుకోని ఘటన జరిగింది. ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వచ్చే నెలలో షూటింగ్‌ ప్రారంభించేందుకు హైదరాబాద్ దుండిగల్‌ ప్రాంతంలో వేసిన సెట్‌ ఈ ప్రమాదంలో దగ్ధమైంది. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. అయితే, సెట్ మాత్రం పూర్తి స్థాయిలో కాలిపోయినట్లు తెలుస్తోంది. మళ్లీ ఆ సెట్ నిర్మించేందుకు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. పవన్ ఎన్నికల వరకు అన్ని సినిమాలు కంప్లీట్ చేసుకోవాలని భావిస్తున్న ఈ సమయంలో సెట్ కాలిపోవడం మేకర్స్ కు ఇబ్బందికరంగా మారింది. అయితే, వీలైనంత త్వరగా మళ్లీ సెట్ నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది. అయినా, ముందుగా అనుకున్న సమయానికంటే  కాస్త ఆలస్యంగానే షూటింగ్ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.  


ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్    


ఇక 'హరి హర వీరమల్లు' సినిమాలో ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. అయితే, బాబీ డియోల్‌కు తొలి తెలుగు చిత్రమిది. ఇంతకు ముందు ఆయన చేసిన కొన్ని హిందీ చిత్రాలు తెలుగులో అనువాదం అయ్యాయి. అలాగే, ఓ వెబ్ సిరీస్ కూడా! ఇప్పుడు పవన్ సినిమాతో నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'హరి హర వీరమల్లు'లో పవన్ కల్యాణ్ సరసన నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి   కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు అమ్మాయి పూజితా పొన్నాడ కూడా ఓ రోల్ చేస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు.  






Read Also: అఖిల్‌‌కు బదులు నిఖిల్ - చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక, మెగా ఫ్యాన్స్‌కూ మింగుడు పడని ఆ నిర్ణయం!