Amit Shah Manipur Visit: గతకొంత కాలంగా మణిపూర్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలను ఆపి పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మణిపూర్ కు వెళ్లారు. మూడు రోజుల పాటు అక్కడే ఉండి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. రాష్ట్రంలో సంక్షోభం నివారణ దిశగా ఆయన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంఫాల్ లో పరిస్థితులను అమిత్ షా ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు. హోంమంత్రి పర్యటన వేళ అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ పర్యటన టైంలోనే మణిపాల్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సాయుధకుకి మిలిటెంట్లు ప్రత్యర్థి మైతి వర్గానికి చెందిన ఎనిమిది కొండ గ్రామాలపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరు చనిపోగా.. 10 మంది వరకు గాయపడినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. కక్చింగ్ జిల్లాలో మిలిటెంట్లు శనివారం అర్ధరాత్రి మైతీ వర్గానికి చెందిన వారి 80 ఇళ్లకు నిప్పు పెట్టారు. దీంతో గ్రామస్థులు భయంతో ఇళ్లొదిలి పారిపోయారు. మరోవైపు బిష్ణుపూర్ జిల్లాలో మిలిటెంట్లు మైతీ వర్గం ప్రజలకు చెందిన 30 ఇళ్లకు నిప్పు పెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు నిషేధాజ్ఞల సడలింపు సమయాన్ని 11 గంటల నుంచి 6 గంటలకు కుదించారు.
కుకీలు దాడులు చేస్తున్నా భద్రతా బలగాలు పట్టించుకోవడం లేదంటూ ఇంఫాల్ వెస్ట్ జిల్లా ఫయొంగ్ గ్రామానికి చెందిన మహిళలు నిరసనకు దిగారు. ఇక షెడ్యూల్ తెగ హోదా విషయమై రాష్ట్రంలో ఈనెల 3వ తేదీ నుంచి కుకి, మైతి వర్గాల మధ్య మొదలైన ఘర్షణల్లో 75 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా ఘటనల నేపథ్యంలో మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ సందర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్నది జాతు మధ్య వైరం కాదని.. కుకి మిలిటెంట్లు, భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు. పౌరులపై కాల్పులకు దిగుతూ. ఇళ్లకు నిప్పు పెడుతున్న 40 మంది తీవ్రవాదలను ఇప్పటి వరకు బలగాలు చంపినట్లు తెలిపారు.