GSLV F12: ఇస్రో మరో విజయం అందుకుంది. GSLV F-12 రాకెట్ ప్రయోగం సక్సెస్ అని ఇస్రో ప్రకటించింది. నేవిగేషన్ శాటిలైట్ NVS-01 ని GSLV F-12 రాకెట్  విజయవంతంగా కక్ష్యలో ప్రవేశ పెట్టినట్టు తెలిపింది. శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన GSLV F-12 రాకెట్ 18 నిమిషాల 45 సెకండ్లలో NVS-01 నావిగేషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. జీపీఎస్ ఆధారిత సాంకేతికతకు ఈ ప్రయోగం చాలా కీలకం. NVS-01తోపాటు మరో ఐదు ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి పంపించాల్సి ఉంది. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ ఉపగ్రహాలను కక్ష్యల్లో ప్రవేశ పెట్టడానికి ఇస్రో సన్నాహాలు చేస్తోంది. 


 






 


షార్‌ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. ఆదివారం ఉదయం 7.12 గంటలకు కౌంట్‌ డౌన్‌ మొదలు పెట్టారు. ఈ ఉదయం 10.42 గంటలకు రాకెట్‌ ప్రయోగం మొదలైంది. సరిగ్గా 18 నిమిషాల 45 సెకండ్లలో ప్రయోగం పూర్తయింది. NVS-01 ఉపగ్రహం కక్ష్యలో కుదురుకుంది.


ఎందుకీ ప్రయోగం.. ?


నావిగేషన్ కి సంబంధించి ఇతర దేశాల టెక్నాలజీపై ఆధారపడకుండా భారత్.. సొంతగా ఉపగ్రహాలతో ఇండియన్ రీజనల్ నేవిగేషన్ సిస్టమ్ ని రూపొందించుకుంది. జీపీఎస్ ఆధారిత సేవలకు ఇది ఎంతో కీలకం. దీనికి బహుళ ఉపగ్రహాల సేవలు అవసరం. అందుకోసం IRNSS-1A నుంచి మొదలు పెట్టి మొత్తం 9 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. 2013తో మొదలైన ఈ ప్రయోగాలు, 2018 వరకు కొనసాగాయి. మొత్తం 9 ఉపగ్రహ ప్రయోగాల్లో ఏడు మాత్రమే విజయవంతం అయ్యాయి. అయితే అందులో కూడా కొన్నిటికి కాలపరిమితి తీరిపోయింది. మరికొన్ని ఉపగ్రహాల పనితీరు కూడా మందగించడంతో కొత్త ఉపగ్రగాన్ని ప్రయోగించడం అనివార్యంగా మారింది. దీంతో కొత్తగా NVS-01 పేరుతో కొత్త ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశ పెట్టింది ఇస్రో.


IRNSS-1G స్థానంలో NVS-01 సేవలందించేలా డిజైన్ చేశారు. ఈ ప్రయోగం సక్సెస్ అయింది. NVS-01 ఇకపై పూర్తి స్థాయిలో తన సేవలందిస్తుంది. భారత నేవిగేషన్ వ్యవస్థకు ఇది కీలకంగా మారుతుంది. కేవలం భారత దేశం గురించే కాదు, సరిహద్దుల్లోని 1500 కిలో మీటర్ల మేర నావిగేషన్ కవరేజ్‌ ఉండే విధంగా ఈ ఉపగ్రహ వ్యవస్థను ఇస్రో రూపొందించింది. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది కాబట్టి 12 సంవత్సరాల పాటు దీని సేవలు మనం వినియోగించుకోవచ్చు. అయితే మిగతా ఉపగ్రహాల విషయంలో కూడా ఇస్రో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. మొత్తం ఐదు కొత్త ఉపగ్రహాలను నేవిగేష్ వ్యవస్థకోసం రూపొందించాలి. ఇందులో ఒకటి సక్సెస్ అయింది. మిగతా నాలుగు ఉపగ్రహాల ప్రయోగాలు కూడా ఆరు నెలల గ్యాప్ తో నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు.


సాయుధ దళాలు, పౌర విమానయాన రంగానికి మెరుగైన పొజిషనింగ్, నావిగేషన్ అండ్ టైమింగ్ కోసం ఈ వ్యవస్థను ఇస్రో అభివృద్ధి చేసింది. రెండో తరం నావిగేషన్ శాటిలైట్ సిరీస్‌లలో NVS-01 మొదటిదని ఇస్రో తెలిపింది. ఎల్ఐ బ్యాండ్‌లో కొత్త సేవలను కూడా ఈ శాటిలైట్ అందిస్తుంది. ఈ ఉపగ్రహం బరువు 2,232 కిలోలు. ఇది భారత ప్రధాన భూభాగం చుట్టూ సుమారు 1500 కిలోమీటర్ల మేర రియల్ టైం పొజిషనింగ్ సేవలు అందిస్తుంది.