Manjummel Boys Guna Cave Set : 2006లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన మలయాళీ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’. చిందబరం ఎస్ పొదువల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సర్వైవల్‌ థ్రిల్లర్‌ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. సుమారు రూ. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 250 కోట్లు వసూళు చేసింది. మలయాళ మూవీ ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డుకెక్కింది.

    


గుణ గుహను కళ్లకు కట్టినట్టు చూపించిన మేకర్స్


‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాలో అత్యంత ప్రమాదకరమైన గుణ గుహలను కళ్లకు కట్టినట్లు చూపించారు. సుమారు 900 అడుగుల లోతున్న గుణ గుహలోనే ఈ సినిమాను షూట్ చేశారా? అన్నట్లుగా చిత్రీకరించారు. కొంత మంది నిజంగానే గుణ గుహల్లో షూట్ చేశారని చెప్తే, మరికొంత మంది మాత్రం స్పెషల్ గా సెట్ వేశారన్నారు. తాజాగా ఈ ఊహాగానాలకు చెక్ పెట్టారు మూవీ ప్రొడక్షన్ డిజైనర్ అజయన్ చలిస్సేరి. ఈ సినిమాలో చూపించిన గుహ నిజమైనది కాదన్నారు. పెరుంబవూరులోని ఓ పాత గోడౌన్‌ లో సెట్ వేసినట్లు వివరించారు. “కొడైకెనాల్ లోని గుణ గుహ నిషేధిత ప్రాంతం. ఆ గుహను చూసేందుకు మమ్మల్ని అనుమతించేందుకు కూడా అటవీశాఖ వెనుకాడింది.  చాలా కండీషన్లు పెట్టింది. అన్నింటికీ ఓకే చెప్పి గుణ గుహను చూడ్డానికి వెళ్లాము. గుహ అత్యంత ప్రమాదకరంగా ఉంది.  నీటిలో చాలా కొమ్మలు, ఇతర శిథిలాలు పేరుకుపోయే సీన్ సినిమాలో చూపించాం. అక్కడ కూడా పరిస్థితి అలాగే ఉంది. గుహలోకి 80 అడుగుల కిందకు వెళ్లేందుకు మాకు పర్మిషన్ ఇచ్చారు. అక్కడి వరకు వెళ్లి గుహ ఫోటోలను తీసుకున్నాం. 2006లో ప్రమాదం జరిగిన ప్రాంతంలోని కొలతలు కూడా తీసుకున్నాం” అని వివరించారు. 


సెట్ వేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది- అజయన్


సినిమా కథ అనుకునే సమయంలోనే గుణ గుహ గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేసినట్లు అజయన్ తెలిపారు. “గుణ గుహ ఫోటోలు, వివరాల కోసం ఇంటర్నెట్ లో సెర్చ్ చేశాం. గుణ గుహకు సంబంధించి ఫోటోలు, వీడియోలు క్వాలిటీగా లేవు.‘గుణా’ సినిమాలోని వీడియో కూడా అనుకున్నట్లుగా లేదు. అందుకే గుహకు సంబంధించి వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు వెళ్లాం. అక్కడ చూసి వచ్చాక.. గుణ గుహ కోసం ఒక సెట్ వేసేందుకు హైదరాబాద్ లోని స్టూడియోలు చూడ్డానికి వెళ్లాం. కానీ, భూగర్భంలో  సెట్ నిర్మించుకునే పరిస్థితి కనిపించలేదు. నిజానికి సుభాష్ ఎంత లోతులో పడ్డాడో చూపించడానికి 17 అడుగుల లోతు తవ్వాలి. ఏ స్టూడియోలోనూ అది సాధ్యం కాలేదు. చివరకు పెరుంబవూరులోని ఓ గోడౌన్‌ లో ఈ సినిమా సెట్ వేసేందుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించాం. ఈ సెట్ నిర్మించేందుకు సుమారు 3 నెలల సమయం పట్టింది. గుహలో ఉన్నట్లు రాళ్లను నిర్మించేందుకు కొడైకెనాల్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన ఫైబర్‌ వాడాం. అందుకే, గుహ చాలా నేచురల్ గా కనిపించింది. ఈ సెట్ చూసి చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఆశ్చర్యపోయారు” అని అజయన్ వెల్లడించారు.   


Read Also: ‘కన్నప్ప’లో ప్రభాస్‌కు నచ్చిన క్యారెక్టర్ చేస్తున్నాడు, ఎవరి మాటలు నమ్మొద్దు - మంచు విష్ణు