Happy Mother's Day 2024:  దైవానికే జన్మనిచ్చిన అమ్మలు కొందరు...దైవాన్ని బిడ్డగా భావించి ప్రేమను పంచిన అమ్మలు మరికొందరు. అలాంటి మదర్స్ గురించి మదర్స్ డే సందర్భంగా  తెలుసుకుందాం...


దేవకి
శ్రీకృష్ణుడిని కన్నతల్లి దేవకి. రాజ్య కాంక్షతో మధురను పాలించే తండ్రి ఉగ్రసేనుడిని  బంధించి అధికారం చేజిక్కించుకుంటాడు దేవకి సోదరుడు  కంసుడు. సోదరి అంటే మాత్రం ఎంతో ప్రేమ. వసుదేవుడికి ఇచ్చి వివాహం చేసి..రథసారధిగా మారి సోదరిని అత్తారింటికి సాగనంపేందుకు సిద్ధమవుతాడు. అప్పుడు ఆకాశవాణి మాటలు వినిపిస్తాయి. ఓ కంసా నీ సోదరిపై అంత ప్రేమ చూపిస్తున్నావు కానీ ఆమె కడుపున పుట్టిన ఎనిమిదో సంతానం నీ ప్రాణాలు తీస్తాడని చెప్పింది. అప్పటివరకూ సోదరిపై అంతులేని ప్రేమ చూపిన కంసుడు...దేవకి-వసుదేవులను కారాగారంలో బంధించేశాడు. అప్పటి నుంచి ఆమె పడిన వేదన వర్ణనాతీతం. నవమాసాలు మోసికన్న బిడ్డలను అన్నదమ్ముడు కళ్లముందే చంపేశాడు. 8వ సంతానం గా భగవంతుడు శ్రీ కృష్ణుడు జన్మించాడు కానీ..కళ్లారా చూడకముందే పొత్తిళ్లనుంచి దూరమయ్యాడు. మళ్లీ పెద్దయ్యాక కానీ తల్లిదగ్గరకు చేరుకోలేకపోయాడు.  


Also Read: శమంతక మణి గురించి ప్రచారంలో ఉన్న కథలేంటి - ఇప్పుడా మణి ఎక్కడుందో తెలుసా!


 
యశోద
శ్రీ కృష్ణుడి కన్నతల్లి దేవకి అయినా పెంచిన తల్లి, అమ్మతనానికి సరికొత్త అర్థాన్నిచ్చిన మాతృమూర్తి యశోద. అందరి అమ్మల లానే బిడ్డను మందలించింది, మంచి దారిలో నడిపించింది, దండించింది..ఆ తర్వాత తనే భగవంతుడు అని తెలుసుకుని ఆశ్చర్యపోయింది, చేతులెత్తి నమస్కరించింది. 


కౌసల్య
దశరధుడు ముగ్గురు భార్యల్లో మొదటిది కౌసల్య. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా కౌసల్య గర్భాన జన్మించాడు. కౌలస్య కేవలం శ్రీరాముడి తల్లి మాత్రమే కాదు..త్యాగానికి, మాతృత్వానికి మారుపేరు ఆమె. చిన్నప్పటి నుంచి  రాజభోగాల మధ్య పెరిగిన శ్రీరాముడు వనవాసానికి వెళ్లినప్పుడు అడ్డుకునే హక్కు కౌసల్యకి ఉంది.  కానీ ఆమె తల్లిగా కుమిలిపోయింది కానీ పాలకుడి జీవితభాగస్వామిగా తన కర్తవ్యం విషయంలో వెనుక్కు తగ్గలేదు. పితృవాక్య పరిపాలకుడిగా కొడుకుని నిలబెట్టడంలో తల్లిగా కౌసల్యకి నూటికి నూరు మార్కులు. తనయుడు అరణ్యవాసానికి వెళ్లిన తర్వాత కూడా ఆమె ఎన్నో కష్టాలుపడినా ఎక్కడా ధైర్యం సడలలేదు.  


Also Read: విభీషణుడు సహా ఇప్పటికీ జీవించి ఉన్న పురాణ పురుషులు వీళ్లే!


సుమిత్ర
దశరథుడి రెండో భార్య అయిన సుమిత్ర..భరతుడికిరాజ్యం ఇచ్చినప్పుడు తన కొడుక్కి కూడా ఆ భోగం దక్కాలని ఆశించవచ్చు. కానీ సుమిత్ర కేవలం తన తనయుడిలో అన్నపట్ల ఉన్న ప్రేమను మాత్రమే చూసింది. ఓ తల్లిగా..కొడుకు ఎలా ఉంటే సంతోషంగా ఉంటాడో ఆ దారిలోనే నడవమంది. అందుకే సోదరుడి పట్ల ఉన్న అచంచలమైన ప్రేమ, భక్తి కారణంగా రాముడితో కలసి అరణ్యవాసానికి వెళ్తున్న సమయంలో అస్సలు అడ్డుచెప్పకుండా పిల్లలు తీసుకునే నిర్ణయాలను ప్రోత్సహించిన మంచి తల్లి సుమిత్ర. 


బెజ్జమహాదేవి
సాక్షాత్తు పరమేశ్వరుడినే తన బిడ్డగా భావించి ఆయన ప్రతిమకు ఉపచారాలు చేసిన మహాభక్తురాలు బెజ్జమహాదేవి.ఆ భక్తిని చూసి కరిగిపోయిన శంకరుడు బాలుడిలా మారి నేరుగా ఆమె ఇంటికి వచ్చి గోరుముద్దలు తింటాడు. ఆఖరికి ఆమెను తనలో లీనం చేసుకున్నాడు. 


వకుళాదేవి
కృష్ణుడిని పెంచిన యశోద..తర్వాత జన్మలో వకుళమాతగా జన్మించింది. శ్రీ వేంకటేశ్వర స్వామిని తన కుమారుడిగా భావించి సేవలందించింది వకుళాదేవి. తిరుపతి శ్రీవారి ఆళయానికి ఆగ్నేయదిశలో ఉండే వంటగదిలో స్వామికి అన్నం తినిపించేదని చెబుతారు. 


Also Read: అక్షయ పాత్ర మొదట ఎవరు ఎవరికి ఇచ్చారు - ఇప్పుడా పాత్ర ఎక్కడుంది!
 
అనసూయ దేవి
తన పాతివ్రత్యాన్ని పరీక్షించేందుకు వచ్చింది సాక్షాత్తూ ఆ త్రిమూర్తులే అని అనసూయకు తెలియదు. కానీ ఆహారం వడ్డించే సమయంలో వారు పెట్టిన నియమం విని ఆమె ఆశ్చర్యపోయింది. ఏం చేయాలో ఆలోచించి ఆ ముగ్గురు మహర్షులను తన పాతివ్రత్య మహిమతో వారిని చిన్నారులుగా మార్చి తన ఒడిలోకి తీసుకుని ఆహారం అందించింది. ఆ భక్తికి మెచ్చి త్రిమూర్తులు ముగ్గురు దత్తాత్రేయుడిగా ఆమెకు జన్మించారు.