ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, ప్రముఖ హీరో - నిర్మాత మంచు విష్ణు సమావేశం కానున్నారు. జ‌గ‌న్‌ను కలవడం కోసం హైదరాబాద్ నుంచి అమరావతికి విష్ణు బయలు దేరారు. ఈ రోజే జగన్, విష్ణు సమావేశం జరగనుంది.


'మా' అధ్యక్షుడి హోదాలో ఏపీ ముఖ్యమంత్రిని ఇప్పటి వరకూ విష్ణు మంచు కలవలేదు. ఇదే తొలిసారి. ఈ సమావేశంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబధించిన సమస్యల గురించి చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


ఇటీవల చిరంజీవి నేతృత్వంలో మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్. నారాయణమూర్తి తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత త్వరలో పరిశ్రమ సమస్యలకు శుభం కార్డు పడుతుందని ఆశిస్తున్నట్టు చిరంజీవి తెలిపారు. అయితే... అక్కడితో సమస్యకు ముగింపు పడలేదు. కొత్త సమస్యలు తలెత్తాయి. చిరంజీవి పరిశ్రమ పరువు తీశారని, అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి ముందు యాచించినట్టు ప్రవర్తించారని తమ్మారెడ్డి భరద్వాజ, రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. నటుడు వీకే నరేష్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.


Also Read: పేర్ని నానితో భేటీ - ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీఎంట్రీపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు


వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని ఇండస్ట్రీ తరఫున హీరోలు కలిసి వచ్చిన తర్వాత... మంత్రి పేర్ని నానిని ఇంటికి ఆహ్వానించారు మోహన్ బాబు. ఆ తర్వాత విష్ణు చేసిన ట్వీట్స్ కూడా చర్చనీయాంశం అయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్ - విష్ణు సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. విష్ణుకు జగన్ బావ అయినప్పటికీ... పరిశ్రమ సమస్యల మీద సమావేశం కావడంతో ఏం చర్చకు వస్తాయోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


Also Read: మంజులతో 'కార్తీక దీపం' నిరుపమ్ లిప్ లాక్! టీవీ షోలో ఇద్దరూ...