ఏపీ మంత్రి పేర్ని నాని ఇటీవల హైదరాబాద్ వచ్చారు. బొత్స సత్యనారాయణ కుమారుడి పెళ్లికి అటెండ్ అయ్యారు. పెళ్లి తర్వాత కలెక్షన్ కింగ్ డా.  మంచు మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. మోహన్ బాబు కుమారుడు విష్ణు స్వయంగా ఆ విషయాన్ని ట్వీట్ చేశారు. అయితే... ఆ తర్వాత ఎందుకు వెళ్లారు? ఏమిటి? అనే విషయాలపై చర్చ జరిగింది. చిరంజీవి నేతృత్వంలో కొంత మంది స్టార్ హీరోలు అమరావతి వెళ్లి ఏపీ సీయం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత మోహన్ బాబు ఇంటికి పేర్ని నాని వెళ్లడంతో... సీయంతో సినీ ప్రముఖుల సమావేశం వివరాల్ని తెలపడానికి ప్రభుత్వ ప్రతినిథిగా పేర్ని నాని వచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. విష్ణు తొలుత ఒక ట్వీట్ చేసి, ఆ తర్వాత దాన్ని డిలీట్ చేసి మరో ట్వీట్ చేయడం కూడా చర్చనీయాంశం అయ్యింది. ట్వీట్స్ గురించి పేర్ని నాని కూడా స్పందించారు. ఆ వివాదం గురించి 'సన్ ఆఫ్ ఇండియా' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ బాబు మాట్లాడారు.


"ప్రతి పార్టీలోనూ నాకు స్నేహితులు, సన్నిహితులు ఉన్నాయి. పేర్ని నాని గారు ఒక పెళ్లికి వస్తే... 'బ్రదర్, మా ఇంటికి బ్రేక్ ఫాస్ట్ వస్తారా?' అని అడిగా. అందులో తప్పు ఏముంది? కొంత మంది ఏదేదో ఊహించుకుంటే ఎలా? అది తప్పు పడితే ఎలా?" అని మోహన్ బాబు ప్రశ్నించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ "సరదాగా మేం ఎప్పుడు కలిశాం, ఎవరితో కలిశామన్నది మాట్లాడుకున్నాం. అంతే! 'జగన్ గారు ఏం మాట్లాడారు, మా సినిమా వాళ్ళు ఏం మాట్లాడారు? ఆ విషయాలు నాకు చెప్పండి!' అని ఎలా అడుగుతాం!? ఇంటికి పిలిచిన అతిథిని గౌరవించాం. 'అప్పుడప్పుడూ కలుద్దాం బ్రదర్' అనుకున్నాం. దాని గురించి రకరకాలుగా రాశారు" అని అన్నారు.


"విష్ణుబాబు నీట్ గా 'మీరు ఇంటికి వచ్చారు. ఆతిథ్యం స్వీకరించారు. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి చేసినటువంటి సహాయాలకు ధన్యవాదాలు' అన్నారు. దాన్ని తప్పు బట్టారు. మా ఇంటికి ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మేథావులు, అన్ని పార్టీ వాళ్ళను ఆహ్వానిస్తా. భోజనం చేస్తాం. వాటిని తప్పు పడితే ఎలా?" అని మోహన్ బాబు స్పందించారు. టికెట్ రేట్స్ గురించి ఆయన మాట్లాడలేదు.


Also Read: మోహన్ బాబు ఆహ్వానం మేరకే భేటీ, ఎవరికీ సంజాయిషీ ఇచ్చేందుకు కాదు : మంత్రి పేర్ని నాని


'ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా?' అని ప్రశ్నించగా... "ఈ జన్మకు వద్దని అనుకున్నాను. చాలు" అని మోహన్ బాబు సమాధానం ఇచ్చారు. 'ఎందుకు?' అని అడగ్గా... "చంద్రబాబు బంధువు. అప్పుడు అన్నయ్యతో సినిమా చేశాం. ప్రచారానికి పంపించారు. వెళ్లాం. జగన్ బంధువు. చంద్రబాబుకు చేసినట్టు ఇక్కడ కూడా చేయాలి కదా! ప్రచారం చేశాం. అయిపొయింది. ఇప్పుడు సినిమాలు, యూనివర్సిటీ అని బోలెడు పనులు ఉన్నాయి" అని కలెక్షన్ కింగ్ తెలిపారు.


Also Read: పరువు తీశావయ్యా చిరంజీవి, జ‌గ‌న్‌ను అడుక్కోవాలా? తమ్మారెడ్డి ఘాటు వ్యాఖ్యలు