మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇవాళ బర్త్ డే జరుపుకుంటున్నారు. 38వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఆయనకు, అభిమానులు, బంధువులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ లో అందరితో చాలా ఫ్రెండీగా ఉంటారు రామ్ చరణ్. సీనియర్ల నుంచి యంగ్ హీరోల వరకు ఇట్టే కలిసిపోతారు. వివాదాలకు దూరంగా ఉండే చెర్రీ అంటే అందరికీ చాలా ఇష్టం. సక్సెస్ సాధించినా, ఫ్లాఫులు చవిచూసినీ ఒకేలా ఉంటారు. స్నేహానికి ఎంతో విలువనిస్తారు. అందుకే, అందరూ రామ్ చరణ్ ను బాగా ఇష్టపడుతారు. బర్త్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. 


చెర్రీకి మంచు మనోజ్ శుభాకాంక్షలు


ఇక తాజాగా అన్నతో గొడవ కారణంగా వార్తల్లోకి ఎక్కిన మంచు మనోజ్ సైతం చెర్రీకి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి సూపర్ డూపర్ బర్త్ డేలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. “నా స్వీటెస్ట్ బ్రదర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు సూపర్ డూపర్ పుట్టినరోజు శుభాకాంక్షలు!  మిత్రమా,  నిన్ను చూసి నిజంగా గర్వపడుతున్నాను. నువ్వు మరిన్ని అద్భుతమైన బర్త్ డేలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ ఇన్ స్టా వేదికగా విషెస్ తెలిపారు.  చెర్రీతో కలిసి మంచు లక్ష్మీ, తను కేక్ కట్ చేయిస్తున్న ఫోటోను షేర్ చేశారు. అయితే, ట్రోలర్స్ మాత్రం మంచు విష్ణుతో జరిగిన గొడవపైనే కామెంట్లు పెడుతున్నారు. విష్ణు నీకు ‘స్వీటెస్ట్ బ్రదర్’ కాదా అంటూ సెటైర్లు వేస్తున్నారు.






స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన గీతా ఆర్ట్స్


ప్రపంచ వ్యాప్తంగా రామ్ చరణ్ బర్త్ డే వేడుకలను నిర్వహిస్తున్నారు ఆయన అభిమానులు. అన్ని దేశాల్లో వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.  రక్తదాన శిబిరాలు, రోగులకు పండ్ల పంపిణీ, వృద్ధులకు దుస్తుల పంపిణీ లాంటి కార్యక్రమాలను చేపడుతున్నారు.  చెర్రీ బర్త్ డే సందర్భంగా  ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  



చెర్రీకి వెరీ వెరీ స్పెషల్ బర్త్ డే


ఇక రామ్ చరణ్ కు ఈ పుట్టిన రోజు వెరీ వెరీ స్పెషల్ గా చెప్పుకోవచ్చు. ‘RRR’ సినిమాతో ఎన్నో విజయాలను అందుకున్నారు. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఏకంగా ఆస్కార్ అవార్డును దక్కించుకుంది. ఇక ఆస్కార్ వేడుకల కోసం అమెరికాకు వెళ్లిన చరణ్ కు అక్కడ ఎంతో గౌరవం లభించింది. అమెరికాలో పాపులర్ షో గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొనే అరుదైన ఛాన్స్ దక్కించుకున్నారు. అంతేకాదు, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ఈవెంట్ కి అతిథిగా హాజరయ్యారు.  హెచ్ సీ ఏ రామ్ చరణ్ ని స్పాట్ లైట్ అవార్డుతో సత్కరించి గౌరవించింది. ‘RRR’  స‌క్సెస్ త‌ర్వాత చ‌ర‌ణ్‌తో సినిమా చేయ‌డానికి బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ‌లు క్యూ క‌డుతోన్నాయి. ప్ర‌స్తుతం శంక‌ర్‌తో ‘గేమ్‌ఛేంజ‌ర్’ అనే పాన్ ఇండియ‌న్ సినిమా చేస్తున్నారు. ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబుతో ఓ సినిమాకు ఓకే చెప్పారు.


Read Also: 'మెగా పవర్ స్టార్' నుంచి 'గ్లోబల్ స్టార్' వరకూ - చిరును మించిన చెర్రీ, అదొక్కటే మిగిలి ఉంది!