Pulimada Netflix: ఓటీటీల విస్తృతి పెరిగిన నేపథ్యంలో థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. పెద్ద సినిమాలు 4 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తే, చిన్న సినిమాలు మాత్రం రెండు, మూడు వారాల్లోనే స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. తాజాగా మలయాళంలో విడుదలై థ్రిల్లర్ గా గుర్తింపు తెచ్చుకున్న ‘పులిమడ’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమాను స్ట్రీమ్ చేయవచ్చు.
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘పులిమడ’
మలయాళ హీరో జోజు జార్జ్, తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ‘పులిమడ’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా అక్టోబర్ 26వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాను చూడని ప్రేక్షకులు ఓటీటీలో చూసేయవచ్చు.
‘పులిమడ’ కథ ఏంటంటే?
‘పులిమడ’ సినిమాను దర్శకుడు ఏకే సజన్ తెరకెక్కించారు. ఈ మూవీ అంతా విన్సెంట్ స్కారియా (జోజు జార్జి) అనే 40 ఏళ్ల కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న తన తల్లిని చూసుకోవడంతో పాటు తనకు కాబోయే భార్య (ఐశ్వర్య రాజేష్) బాయ్ ఫ్రెండ్ తో వెళ్లిపోవడంతో విన్సెంట్ జీవితం తారుమారు అవుతుంది. పెళ్లి జరగలేదనే బాధ విన్సెంట్ ను ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లిందో ఈ చిత్రంలో చూపిస్తారు. ఈ మూవీలో నటీనటుల నటన, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటాయి. ప్రధానంగా విన్సెంట్ స్కారియాగా జోజు జార్జ్ నటన చాలా బాగుటుంది. తన పాత్రలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేస్తారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మాహిష్మతిగా కనిపించింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో థ్రిల్లర్ మూవీగా వచ్చిన ‘పులిమడ’ ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇక ఈ సినిమాలో వినోద్ జోస్, లిజోమోల్ జోస్, జాఫర్ ఇడుక్కి, జానీ ఆంటోని, బాలచంద్ర మీనన్, సోనా నాయర్, కృష్ణ ప్రబ, పౌలీ వల్సన్, జాలీ చిరయాత్, అబూ సలీం, అబిన్ బినో, ఫారా షిబ్లా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా వేణు వ్యవహరించారు. జీతూ సెబాస్టియన్ ఆర్ట్ డైరెక్టర్ గా చేశారు. రాజేష్ దామోదరన్, సిజో వడక్కన్ నిర్మించారు. ఈ సినిమాకు ఇషాన్ దేవ్, అనిల్ జాన్సన్ సంగీతం అందించారు.
జోజు జార్జి ప్రస్తుతం తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘ఆదికేశవ’లో జోజు జార్జి నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నారు.
Read Also: అనసూయ షాకింగ్ డెసిషన్ - ఎడబాటే అగౌరవానికి సమాధానమంటూ!