సుకుమార్ దగ్గర శిష్యుడిగా పని చేసిన బుచ్చిబాబు సానా 'ఉప్పెన' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఇక ఇండస్ట్రీలో ఈయనకు తిరుగుండదని అనుకున్నారు. నిజానికి హిట్ డైరెక్టర్ చుట్టూనే హీరోలు తిరుగుతుంటారు. మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్ లో చేరిన బుచ్చిబాబుతో కలిసి పని చేయడానికి టాలీవుడ్ హీరోలు ఉత్సాహం చూపించారు. కానీ అతడి రెండో సినిమా ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్లకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

 


 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి బడా హీరో బుచ్చిబాబుతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడు. వాళ్లిందరికీ ముందు నుంచి మంచి అనుబంధం ఉండడంతో బుచ్చిబాబు చెప్పిన కథ విన్నాడు. ఆయనకు నచ్చడంతో సినిమా చేయాలనుకున్నారు. కానీ ఎన్టీఆర్ కి ఉన్న కమిట్మెంట్స్ కారణంగా మరో రెండు, మూడేళ్ల వరకు బుచ్చిబాబుతో సినిమా చేసే అవకాశం కనిపించడం లేదు. దీంతో వేరే స్టార్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు బుచ్చిబాబు. కానీ ఎంతకీ ఎవరూ ఒప్పుకోవడం లేదు. 

 

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్లంతా బిజీగా ఉండడంతో.. వెంటనే బుచ్చిబాబుతో సినిమా చేసే అవకాశం లేకపోవడం ఇప్పుడు బుచ్చిబాబుకి సమస్యగా మారింది. మొన్నామధ్య తన తొలి హీరో వైష్ణవ్ తేజ్ తోనే బుచ్చిబాబు రెండో సినిమా కూడా చేస్తాడని వార్తలొచ్చాయి. కానీ అది జరిగేలా లేదు. ఇదిలా ఉండగా.. టాలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. బుచ్చిబాబు ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుని కలిశాడట. వీరి మధ్య జరిగిన మీటింగ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

 


 

ఒకవేళ బుచ్చిబాబు చెప్పిన కథ మహేష్ బాబుకి నచ్చినా.. కూడా మహేష్ డేట్స్ ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం ఆయన 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత లైన్లో రాజమౌళి సినిమా ఉంది. ఇవన్నీ పూర్తి చేయడానికి మరో రెండేళ్ల సమయం పడుతుంది. కాబట్టి బుచ్చిబాబుతో ఇప్పట్లో సినిమా చేసే ఛాన్స్ లేదు. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న బుచ్చిబాబుకి వెంటనే డేట్స్ ఇచ్చే స్టార్స్ దొరుకుతారేమో చూడాలి!