తమిళ హీరోలకు కోర్టుల నుంచి చీవాట్లు తప్పడం లేదు. మొన్నటికి మొన్న దిగుమతి చేసుకున్న కార్ల విషయంలో   విజయ్ , ధనుష్ కోర్టు చీవాట్లు తిని టాక్సులు కట్టారు. ఇప్పుడు వంతు హీరో సూర్యది. ఆదాయపన్ను శాఖ ఇచ్చిన నోటీసుల విషయంలో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు ఆ కేసులోఎదురు దెబ్బ తిన్నారు. 2010లో ఆదాయ పన్ను శాఖ అధికారులు  దాదాపు రూ.3 కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. దీన్ని  వ్యతిరేకిస్తూ సూర్య హైకోర్టులో పిటిషన్ వేశారు.  సూర్య తన ఆదాయానికి తగ్గట్టు పన్నులు చెల్లించలేదనే కారణంతో 2010లో ఏక కాలంలో ఆయనకు సంబంధించిన ఇళ్లు, వ్యాపార కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. 


పెద్ద ఎత్తున లెక్కల్లో లేని ఆదాయం బయట పడటంతో.. వాటికి సంబంధించి  మొత్తం రూ. 3.11 కోట్లు పన్నులు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఐటీ అధికారులు ఆయనకు వడ్డీ కూడా వేశారు. వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించారు. అసలు పన్ను కట్టడానికి సిద్ధపడిన సూర్య వడ్డీ మాత్రం కట్టడం నామోషీగా భావించారు. అందుకే ఆయన న్యాయపోరాటం చేయాలనుకున్నారు .  ఆదాయపు పన్ను అధికారులు జారీ చేసిన నోటీసులో వడ్డీ మినహాయించాలని కోరుతూ   మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.వడ్డీ మినహాయింపు పొందడానికి తనకు అర్హత ఉందని కోర్టులో సూర్య వాదించారు. 


అయితే  వడ్డీ మినహాయింపు పొందడానికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 220 (2A) ప్రకారం పేర్కొన్న మూడు షరతులను సూర్య పాటించలేదని హైకోర్టుకు ఐటీ శాఖ ఆదారాలు సమర్పించింది. సూర్య ఇళ్లు, సోదాల్లో సోదాలు చేసి పన్ను కట్టని ఆదాయాన్ని గుర్తించామని.. ఆయన స్వచ్చందంగా ఎసెస్‌మెంట్ చేసింది కాదని ఐటీ శాఖ తెలిపింది. ఐటీ శాఖ వాదనను హైకోర్టు సమర్థించింది. సెలబ్రిటీగా ఉన్నత స్థానంలో ఉన్న సూర్య లాంటి వ్యక్తులు మిగతా వారికి ఆదర్శంగా ఉండాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సిందేనని తీర్పు ఇచ్చింది. 


తమిళ హీరోలు ఇలా చిన్న చిన్న విషయాలకే కోర్టుల దగ్గరకు వెళ్లి ఎందుకు చివాట్లు తింటున్నారో అభిమానులకు కూడా అర్థం కావడం లేదు. గతంలో చాలా కొద్ది మొత్తం పన్ను విషయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కోర్టు అక్షింతలు వేయించుకున్నారు. పన్నులు కట్టకుండా కోర్టు ద్వారా తప్పించుకునే ప్రయత్నం చేయడంపై అభిమానుల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. తన కేసు అంశంపై సూర్య ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన వడ్డీతో సహా ఆదాయపన్నుకు జరిమానా కట్టే అవకాశం ఉంది.