`మా` ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మాజీ అధ్యక్షుడు నరేష్ పదవీ కాలం ముగియడంతో ఎన్నికలు అనివార్యంగా మారడంతో ఇప్పటికే ఎన్నికల తేదీ ప్రకటించారు. అక్టోబర్ 10న `మా` ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీకోసం అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్ , మంచు విష్ణు పోటీపడుతున్నారు. ఇప్పటికే ఇరు వర్గాలు తమ ప్యానెల్ సభ్యులను ప్రకటించారు. ఇదివరకే వరుస ప్రెస్ మీట్లు పెట్టిన ప్రకాశ్ రాజ్ తాను ఏం చేయాలనుకుంటున్నానో.. ఏం చేస్తారో చెప్పుకుంటూ వచ్చాడు. అటు మంచు విష్ణు కూడా ప్రకాశ్ రాజ్ కి ధీటుగా కౌంటర్స్ ఇస్తున్నాడు. అయితే ప్రకాష్ రాజ్ ని, రహస్య విందులు- గ్రూపు రాజకీయాల విషయంలో కడిగిపారేసిన బండ్ల గణేష్ తాజాగా సడెన్ షాక్ ఇచ్చాడు. ఎలాంటి ప్యానెల్ లేకుండా,  ఏ ప్యానెల్ తో సంబంధం లేకుండా జనరల్ సెక్రటరీగా పోటీకి దిగుతున్నట్టుగా ప్రకటించాడు.  అధ్యక్ష పదవి నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వరకు మీకు ఇష్టమైన వారికి ఓటేయండి కానీ జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న తనకి మాత్రం కచ్చితంగా ఓటు వేయమని  పోస్టర్  రిలీజ్ చేయడం హాట్ టాపిక్ అయింది. 






బండ్ల స్టైల్ చూసిన వారంతా అక్టోబర్ 10 న జరగబోయే ఎన్నికల  తేదీ వరకు `మా` ఎన్నికల్లో ఇంకా ఎలాంటి చిత్రాలు చూడాలో అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే మా అసోసియేషన్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అభ్యర్థుల విమర్శలు, ప్రతి విమర్శలు పెరుగుతున్నాయి. ఇటీవల ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉన్న బండ్ల గణేష్ బయటకు వచ్చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. కాగా తనకు ఓటు తో దీవించాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు బండ్లగణేష్. ఒకే ఒక్క ఓటు, మా కోసం, మన కోసం, మనందరి కోసం, మా తరఫున ప్రశ్నించడం కోసం అంటూ ట్వీట్ చేశారు. అధ్యక్షుడు, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కోశాధికారిని, సంయుక్త కార్యదర్శులను, కార్యనిర్వాహక సభ్యులను ఎవర్ని ఎన్నుకుంటారో మీ ఇష్టం…కానీ ప్రధాన కార్యదర్శిగా మాత్రం తనకే ఓటేయాలని, తననే గెలిపించండి అంటూ బండ్ల గణేశ్ పోస్టు పెట్టారు.


Also read: నీలి నీలి ఆకాశంలో నెలవంకను తలపిస్తోన్న కన్నడ సోయగం


మా సంఘం గ్రూపులుగా విడిపోయి రాజకీయాలు చేయడం బాలేదన్న మంచు విష్ణు ప్రతి ఒక్కరూ ఈసారి ఎన్నికల్లో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. చాలా వరకూ ఏకగ్రీవం కోసమే ప్రయత్నించానని కూడా చెప్పాడు. ఎన్నికల తీరుపై ఎవరూ హ్యాపీగా లేరని ఎన్నికల గురిం‍చి మీడియా.. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రావడం బాధాకరమని అన్నారు. ఆర్టిస్టుల సొంత భవంతిని తాను సొంత డబ్బులతో నిర్మిస్తానని ప్రకటించిన విష్ణు.. అందులో మల్టీప్లెక్స్.. కళ్యాణ మండపం కట్టనని తేల్చి చెప్పారు. పదవిలో ఉన్నా లేకపోయినా సేవలు చేస్తాను. సమస్యలు ఉంటే కూచుని మాట్లాడుకుందామని చెప్పుకొచ్చాడు. ఇక రాజకీయ పార్టీల జోక్యంపైనా విష్ణు సరదాగా సెటైర్లు వేసారు. ``బాబు మోహన్ అంకుల్ బీజేపీ, మాదాల రవి కమ్యూనిస్ట్ పార్టీ, ఇంకా టీఆర్ఎస్.. టీడీపీ వాళ్లు కూడా ఉన్నారు. మాకు చంద్రబాబు గారు బంధువు. వైఎస్ జగన్ బావగారు అవుతారు. కేటీఆర్ మంచి ఫ్రెండ్.. అన్ని పార్టీల వారూ మా ప్యానెల్ లో ఉన్నారు. దండం పెడుతున్నాను.. పొలిటికల్ పార్టీలను ఇందులోకి లాగకండని అన్నారు. 


Also Read: అప్పుడు 'ముద్దు'గా...ఇప్పుడు హాట్ గా కట్టి పడేస్తోన్న బిహారీ భామ


26 మందితో ప్యానెల్ ని విష్ణు ప్రకటించారు. మంచు విష్ణు అధ్యక్ష పదవికి.. జనరల్ సెక్రటరీగా రఘుబాబు పోటీ చేస్తారు. వైస్ ప్రెసిడెంట్ గా మాదాల రవి.. పృధ్వీరాజ్ పోటీకి దిగుతున్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా బాబుమోహన్... ట్రెజరర్ గా శివబాలాజీ.. జాయింట్ సెక్రటరీగా కరాటే కల్యాణి.. గౌతమ్ రాజు పోటీ చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా 18 మంది పోటీ చేయనున్నారు. హీరోయిన్ అర్చన.. అశోక్ కుమార్.. గీతాసింగ్.. హరినాధ్ బాబు.. జయంతి.. మలక్ పేట శైలజ.. మాణిక్ పోటీకి దిగుతున్నారు. నటి పూజిత.. రాజేశ్వరిరెడ్డి.. హీరోయిన్ రేఖ.. సంపూర్ణేష్ బాబు.. శశాంక్.. శివనారాయణ.. శ్రీలక్ష్మి ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పోటీ చేస్తున్నారు. 


Also Read: పాటల తోటమాలి మనల్ని వదిలి నేటికి ఏడాది.. నీ పాట మిగిలే ఉంది.. మిగిలే ఉంటుంది..


ప్రకాశ్ రాజ్  ప్యానెల్ విషయానికొస్తే  అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్ పోటీపడుతున్నారు. ఉపాధ్యక్షులుగా బెనర్జీ, హేమ, జనరల్‌ సెక్రటరీగా జీవితా రాజశేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గా శ్రీకాంత్‌, ట్రెజరర్ గా నాగినీడు, సంయుక్త కార్యదర్శులుగా అనితా చౌదరి, ఉత్తేజ్ పోటీ చేయనున్నారు.  ప్రగతి,అనసూయ, అజయ్, సుబ్బరాజు, సమీర్, ఖయ్యూం, బ్రహ్మాజీ, కౌశిక్, ప్రభాకర్,భూపాల్, శివారెడ్డి, రమణారెడ్డి, సుడిగాలి సుధీర్, సురేష్ కొండేటి, తనీష్, టార్జాన్ సభ్యులుగా ఉన్నారు. అక్టోబరు 10న `మా` ఎన్నికలు జరగనున్నాయి. 


Also Read: పాటంటే బాలుకు ప్రాణం.. గొంతుకు సర్జరీ జరిగినా ఆపలేదు గానం



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి