హారర్ సినిమాలు అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. కానీ, చూడటానికి మాత్రం చాలా భయపడతారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ కంపెనీ హారర్ సినిమాలు చూస్తే రూ.95వేల రూపాయలు ఇస్తుందట. డబ్బులు ఎవరికీ ఊరికే రావు కదా... ఇక్కడే కొన్ని ట్విస్టులు ఉన్నాయి. సదరు కంపెనీ నుంచి డబ్బులు మీ సొంతం చేసుకోవాలంటే కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. ఇంతకీ అవేంటో ఇప్పుడు చదువుదాం. 


అమెరికాకు చెందిన ఫైనాన్స్ బజ్ అనే కంపెనీ ఈ ప్రకటన చేసింది. తాము సూచించిన 13 హారర్ సినిమాలు చూసిన వాళ్లకి 1300 డాలర్లు... భారత కరెన్సీలో సుమారు రూ.95వేలు ఇస్తానని తెలిపింది. ఇంతకీ వీళ్లు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే కదా మీ సందేహం? మీరు అనుకున్నది నిజమే. దీని వెనక వారు ఓ సర్వే చేస్తున్నారు. అదేంటంటే... తక్కువ బడ్జెట్‌తో తీసిన హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయా ? లేదా? అన్నది వారి సర్వే. భారీ బడ్జెట్‌తో తీసి అన్ని రకాల హంగులతో తీసిన హారర్ సినిమాలతో పాటు తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాలు అభిమానుల్ని ఎంత వరకు ఆ ఫీల్ కలిగిస్తున్నాయో తెలుసుకోవడానికే ఇదంతా. 






వారు సూచించిన 13 సినిమాలను చూసే వాళ్ల కోసం ఫైనాన్స్ బజ్ వేట మొదలుపెట్టింది. సినిమా చూసే సమయంలో వాళ్లు ఇచ్చే ఫిట్ బిట్ బ్యాండ్ తప్పనిసరిగా ధరించాలి. దీన్ని బట్టి సదరు వ్యక్తి ఆ సినిమాలు చూసే సమయంలో గుండె వేగాన్ని వారు అంచనా వేసుకుంటారు. ఇంతకీ ఆ 13 హారర్ సినిమాలు ఏంటంటే... Saw, Amityville Horror, A Quiet Place, A Quiet Place Part 2, Candyman, Insidious, The Blair Witch Project, Sinister, Get Out, The Purge, Halloween (2018), Paranormal Activity, and Annabelle. 


వీరు సూచించిన ఈ సినిమాల లిస్టును అక్టోబరు 9 నుంచి 18 మధ్య చూడాలి. ఈ సినిమాలను అద్దెకు తెచ్చుకునేందుకు అదనంగా 50డాలర్ల గిఫ్ట్ కార్డు కూడా ఫైనాన్స్ బజ్ వారు అందిస్తారు. సెప్టెంబరు 26 వరకు ఎంట్రీలను ఆహ్వానిస్తున్నారు. సంస్థ వారు ఎంచుకున్న వ్యక్తులను అక్టోబరు 1న మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. అక్టోబరు 4 నాటికి వారికి ఫిట్ బిట్ బ్యాండ్ పంపుతారు. ఇక్కడ మరో ట్విస్టు ఏంటంటే... 18 సంవత్సరాలు నిండిన అమెరికాకు చెందిన వారే దీనికి అర్హులు.