దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న తాజా మూవీ ‘లియో‘. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ‘లియో బ్లడీ స్వీట్’ అంటూ నిర్మాణ సంస్థ ప్రోమోను రిలీజ్ చేసింది. ఇందులో విజయ్ సరికొత్త లుక్ లో కనిపించాడు. చాక్ లెట్ తయారీ కేంద్రంలో కత్తి తయారు చేసి, విలన్స్ భరతం పట్టేందుకు రెడీ అయినట్లు చూపించారు. తాజా ప్రోమో సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.  


ప్రత్యేక విమానంలో కశ్మీర్ కు ‘లియో’ మూవీ యూనిట్


ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కశ్మీర్ లో కొనసాగుతోంది. ఇందుకోసం చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో సినిమా యూనిట్ కశ్మీర్ కు బయల్దేరి వెళ్లింది. వీరి కోసం విమానాశ్రమంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. తాజాగా ఈ జర్నీకి సంబంధించిన వీడియోను సెవెన్ స్క్రీన్ స్టూడియో విడుదల చేసింది. ఈ విమానంలో హీరో విజయ్,  హీరోయిన్ త్రిష ముందు సీట్లలో కూర్చుని కనిపించారు. చిన్న పిల్లలతో పాటు ఫ్లైట్ సిబ్బందితో విజయ్ ముచ్చట్లు పెడుతూ సందడి చేశాడు. విమానంలోని ప్రతి ఒక్కరిని పేరు పేరున పలుకరిస్తూ వెళ్లాడు. 






‘లియో’లో ఏజెంట్ టీనా పవర్ ఫుల్ రోల్!


ఇక ‘విక్రమ్’ సినిమాలో ఏజెంట్ టీనా అనే పవర్ ఫుల్ రోల్ పోషించిన వాసంతి ఈ సినిమాలోనూ కనిపించనుంది. ‘లియో’ టీమ్ కాశ్మీర్ జర్నీ వీడియోలో చిత్ర బృందంతో కలిసి వాసంతి కూడా కనిపించింది. 'విక్రమ్' మూవీలో మాదిరిగానే ‘లియో’లోనూ ఆమె పవర్ ఫుల్ రోల్ షోషించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో  బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, దర్శకులు మిస్కిన్, గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, శాండీ మాస్టర్, మాథ్యూ థామస్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో చియాన్ విక్రమ్ కూడా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘విక్రమ్’ సినిమాలో రోలెక్స్ పాత్రలో సూర్య కనిపించినట్లు, ఇందులో విక్రమ్ కనిపిస్తాడని తెలుస్తోంది. మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.  సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్.ఎస్.లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  


రికార్డు స్థాయిలో ‘లియో’ బిజినెస్


ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. నాన్ థియేట్రికల్ రైట్సే ఏకంగా రూ.300 కోట్లకు పైగా అమ్ముడుపోయినట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ సినిమా రూ.600 కోట్లకు పైగా వసూళ్లను సాధిస్తుందని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.  


Read Also: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?