రెబల్ స్టార్ కృష్ణం రాజు (Krishnam Raju), సూపర్ స్టార్ కృష్ణ స్నేహితులు. హీరోలు అవ్వక ముందు నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఒకరికి అవకాశం వస్తే మరొకరు పార్టీ ఇచ్చేంత బాండింగ్ ఉంది. ఇద్దరూ హీరోలు అవ్వక ముందు జరిగిన పార్టీలో కృష్ణ కొందరిపై కోప్పడ్డారు. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
కృష్ణ సెలక్ట్ అయ్యారు...
కృష్ణం రాజును రిజెక్ట్ చేశారు!
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కృష్ణ కథానాయకుడిగా పరిచయమైన సినిమా 'తేనె మనసులు' (Tene Manasulu Movie). కొత్త వాళ్ళతో సినిమా తీస్తానని పత్రికల్లో ప్రకటన ఇచ్చి మరీ ఆదుర్తి సుబ్బారావు ఆ సినిమా చేశారు. ఆయన ఇచ్చిన ప్రకటనతో చాలా మంది ఆడిషన్స్‌కు వెళ్లారు. అందులో కృష్ణం రాజు కూడా ఉన్నారు. ఆయనతో పాటు జయలలిత, సంధ్యా రాణి, హేమ మాలిని కూడా!
Also Read : కృష్ణం రాజు ఫంక్షన్ కోసం షూటింగ్ క్యాన్సిల్ చేసిన సీనియర్ ఎన్టీఆర్
ఆడిషన్స్‌కు వచ్చిన వాళ్ళకు ముందు బ్లాక్ అండ్ వైట్‌లో మేకప్ టెస్ట్ చేశారు. ఆ తర్వాత కృష్ణ, సంధ్యా రాణిని కలర్ మేకప్ టెస్ట్ కోసం ఉండమని, మిగతా వాళ్ళను వెళ్ళమని చెప్పడంతో కృష్ణం రాజుకు పరిస్థితి అర్థం అయ్యింది. కృష్ణను సెలెక్ట్ చేస్తున్నారని ఆయన ముందుగా ఊహించారు. 'తేనె మనసులు' సినిమాలో కృష్ణ హీరోగా ఎంపిక అయినట్టు పత్రికల్లో వచ్చిన తర్వాత ఆయన్ను పిలిచి పార్టీ ఇచ్చారు.
కృష్ణం రాజు పార్టీలో...
కృష్ణ కోపానికి కారణం ఏమిటంటే?
కృష్ణకు హీరో అవకాశం రావడంతో ఆయనతో పాటు మరో పది పన్నెండు మందిని పిలిచి చెన్నైలోని టీ నగర్ పానగల్ పార్కుకు సమీపంలోని 'క్రిసెంట్ పార్క్'లో కృష్ణం రాజు పార్టీ ఇచ్చారు. వేషాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కృష్ణ చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. 'ఎర్రగా ఉంటే హీరో అయిపోతాడా? పీల్ వాయిస్ హీరో పాత్రలకు ఏం పనికి వస్తుంది?' వంటి కామెంట్స్ విని విని విసిగిపోయిన కృష్ణ ఒక్కసారి బరస్ట్ అయ్యారు. ఆ పార్టీలో 'నన్ను మానసికంగా వేధించిన వాళ్ళందరికీ సమాధానం చెబుతా' అని ఆవేశంతో ఊగిపోయారు.
కృష్ణ ఆవేశంలో అర్థం ఉన్నప్పటికీ... 'ఇంకా హీరో కాలేదు. మేకప్ కూడా వేసుకోలేదు. అప్పుడే తొందరపడి ఈ విధంగా మాట్లాడవద్దు' అని స్నేహితులంతా కలిసి బుజ్జగించామని తర్వాత ఒక సందర్భంలో కృష్ణం రాజు తెలిపారు. అదీ సంగతి.
కృష్ణం రాజు జనవరి 20, 1940న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ఆయనది విజయనగర సామ్రాజ్య వారసుల కుటుంబం. ఆయన అసలు పేరు శ్రీ ఉప్పలపాటి చిన వెంకట కృష్ణం రాజు. సినిమాల్లోకి వచ్చినప్పుడు... ఇంటి పేరులో 'శ్రీ', తల్లిదండ్రులు పెట్టిన పేరులో 'చిన వెంకట' పదాలను ఆయన తీసేశారు. ఉప్పలపాటి కృష్ణం రాజుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.