తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి కృష్ణం రాజు (Krishnam Raju) కథానాయకుడిగా ప్రవేశించారు. అయితే, తొలి సినిమా 'చిలకా గోరింక' విజయం సాధించకపోవడంతో కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు. నటనలో శిక్షణ తీసుకుని మళ్ళీ మేకప్ వేసుకున్నారు. ఈసారి ప్రతినాయకుడిగా సినిమాలు చేశారు. విలన్‌గా పేరు వచ్చాక... సహాయక పాత్రల్లో బిజీ అయ్యారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.
 
కృష్ణం రాజుది పెద్దలు కుదిర్చిన వివాహం
కృష్ణం రాజు తొలి వివాహం మే 10, 1969న జరిగింది. ఆయన సతీమణి పేరు సీతాదేవి (Krishnam Raju First Wife Name). ఆవిడ ఎవరో కాదు... కృష్ణం రాజు బావగారి కుమార్తె. వరుసకు మేనకోడలు అన్నమాట. వీళ్ళది పెద్దలు కుదిర్చిన సంబంధం. ఇంట్లో నిశ్చయించిన పెళ్లి. వివాహ సమయానికి కృష్ణం రాజు 'అమ్మ కోసం' షూటింగులో ఉన్నారు. 


పాపికొండల నుంచి నేరుగా పెళ్ళికి...
'అమ్మ కోసం' సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల ఒక జంట కాగా... రెబల్ స్టార్ కృష్ణం రాజు, రేఖ మరో జంటగా నటించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో పెళ్లి జరగడంతో కృష్ణ, విజయ నిర్మలతో పాటు అంజలీ దేవి, రాజబాబు, ఛాయాగ్రాహకులు వీఎస్ఆర్ స్వామి తదితరులు పాపికొండల నుంచినేరుగా పెళ్లికి చేరుకున్నారు.
   
మొగల్తూరు కోటకు తరలి వచ్చిన సినిమా తారలు
కృష్ణం రాజుది రాజవంశ కుటుంబం అనే సంగతి తెలిసిందే. వాళ్ళకు అప్పట్లో మొగల్తూరులో కోట ఉంది. అందులోనే వివాహం జరిగింది. అప్పటికి కృష్ణం రాజు ఫేమస్ ఆర్టిస్ట్ కావడంతో ఆయన పెళ్లికి చాలా మంది సినిమా తారలు హాజరు అయ్యారు. వాళ్ళను చూడటం కోసం జనం తండోపతండాలుగా వెళ్ళారు. సీతా దేవి 1995లో మరణించారు. కారులో ప్రయాణిస్తుండగా... యాక్సిడెంట్ కావడంతో తిరిగి రాని లోకాలకు వెళ్లారు.


Also Read : సినిమాల్లో రాజుగారి అబ్బాయ్ విల‌న్‌ - హీరోగా వరుస విజయాలు - కృష్ణం రాజు కెరీర్‌లో ఇదీ స్పెషల్


శ్యామలా దేవితో రెండో వివాహం
సీతా దేవి మరణం తర్వాత శ్యామలా దేవిని కృష్ణం రాజు వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. ఈ మధ్య పెద్ద కుమార్తె ప్రసీద చిత్రసీమలో ప్రవేశించారు. నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు.


కృష్ణం రాజు సోదరుని కుమారుడు, స్టార్ హీరో ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' చిత్ర నిర్మాతలలో ప్రసీద ఒకరు. 'జాతి రత్నాలు' సినిమా ప్రచార కార్యక్రమాల్లో కూడా ఆమె కీలకంగా వ్యవహరించారు. 


కృష్ణం రాజు జనవరి 20, 1940న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ఆయనది విజయనగర సామ్రాజ్య వారసుల కుటుంబం. ఆయన అసలు పేరు శ్రీ ఉప్పలపాటి చిన వెంకట కృష్ణం రాజు. ఆయన బీకాం చేశారు. తొలుత సినిమాలపై ఆయనకు ఆసక్తి లేదు. కొన్ని రోజులు జర్నలిస్టుగా చేశారు. ఒక అబిడ్స్ లోని ఒక హోటల్ లో టీ తాగుతుండగా... సినిమా అవకాశం ఇస్తామని ఒకరు చెప్పడంతో మద్రాస్ వెళ్ళారు. ఆ సినిమా స్టార్ట్ కాలేదు. అయితే, వెనక్కి తిరిగి రావడానికి ప్రెస్టేజ్ ఇష్యూగా భావించి, అక్కడే ఉండి అవకాశాల కోసం ప్రయత్నిస్తూ విజయాలు సాధించారు. 


Also Read : కృష్ణం రాజు రేర్ ఫోటోస్ - అప్పట్లో ఎలా ఉండేవారో చూడండి