కిరణ్ అబ్బవరం, క‌శ్మీర ప‌ర్ధేశీ జంటగా నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీ ట్రైలర్ మంగళవారం సాయంత్రం విడుదలైంది. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ మూవీ యూత్‌ను ఆకట్టుకొనేలాగే అనిపిస్తోంది. ‘GA2’ బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీతో మురళీ కిశోర్ అబ్బురు దర్శకుడిగా ప‌రిచయం అవుతున్నాడు. 


ట్రైలర్ ఎలా ఉందంటే..: 


ఫోన్ నెంబర్ నైబర్ అనే కొత్త కాన్సెప్ట్‌ను ఈ మూవీతో పరిచయం చేశారు. అంటే.. మీ ఫోన్ నెంబర్‌లో చివరి అక్షరం ముందు, వెనుక నెంబర్లతో ఉండే వ్యక్తులతో స్నేహం చేయడం. అలా.. దర్శనా (క‌శ్మీర) అనే అమ్మాయి తన ఫోన్ నెంబరుకు ముందు ఉన్న నెంబర్‌కు కాల్ చేస్తే కిరణ్, వెనుక వైపు ఉన్న నెంబర్‌కు కాల్ చేస్తే మురళి శర్మ పరిచయం అవుతుంది. దీంతో దర్శనా ప్రేమలో పడతాడు కిరణ్. మరోవైపు వయస్సులో పెద్దవాడైన మురళి శర్మ కూడా ఆమెను ప్రేమిస్తాడు. ఈ నేపథ్యంలో కొన్ని ఫన్నీ సీన్స్‌ను ట్రైలర్‌లో చూపించారు. మురళి శర్మ చెప్పే ఓ డైలాగ్‌కు కిరణ్ ఇచ్చే కౌంటర్ బాగుంటుంది. ‘‘ఇలా ఇద్దరికి ఒకే ఇష్టాలుంటే వారిని ఏమంటారో తెలుసా?’’ అని మురళి శర్మ అంటే.. ‘‘తండ్రి, కూతుళ్లు అంటారు’’ అని కిరణ్ కౌంటర్ వేస్తాడు. అలాగే కిరణ్‌ కూడా తన ఫోన్ నెంబర్‌ నైబర్‌కు ప్రయత్నిస్తాడని తెలుస్తోంది. అయితే, అది నెగటివ్ క్యారెక్టర్ కావచ్చని తెలుస్తోంది. 


ట్రైలర్‌లోని కొన్ని డైలాగులు కూడా ఆకట్టుకుంటాయి. ‘‘ఆడపిల్లలంతా ప్రిన్సెస్ సార్. వారి నెత్తిమీద కిరీటం ఉంటుంది. అది కిందపడకుండా ఉండాలి అంటే వాళ్లెప్పుడూ తలదించుకోకూడదు’’ అని కిరణ్ అబ్బవరం చెప్పే డైలాగ్ బాగుంది. అలాగే చివర్లో శుభలేఖ సుధాకర్ చెప్పే డైలాగు కూడా ఆకట్టుకుంటుంది. ‘‘చెడు అనేది చాలా వేగంగా స్ప్రెడ్ అయ్యి ఒక కాడ ఆగిపోతుంది. అదే మంచి స్ప్రెడ్ అవ్వడానికి టైమ్ పడుతుంది. ఒక్కసారి అయ్యిందో...’’ అంటూ మూవీలోని ఆ ‘కాన్సెప్ట్’ను రివీల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘మనకు కష్టం వస్తే ఎవరో సాయం చేయాల్సిన అవసరం లేదు. పక్కనోళ్లు చేస్తే చాలు. ఎవరికి తెలుసు.. నీ పక్క నెంబరు సీఎందో, పీఎందో, సచిన్‌దో, ధోనీదో, పవర్ స్టార్, ఐకాన్ స్టార్, రెబల్ స్టార్‌ది కూడా అయ్యుండవచ్చు. అలాంటి వాళ్లలో ఒక్కరికైనా ఈ వీడియో రీచైనా నాకు కచ్చితంగా మంచి జరుగుతుంది’’ అనే కిరణ్ అబ్బవరం డైలాగ్‌తో ట్రైలర్ ముగిసింది. మొత్తంగా.. ఈ ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేసింది. చూస్తుంటే కిరణ్ ఈసారి హిట్ కొట్టడం ఖాయమనిపిస్తోంది. 



ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన 'వాసవ సుహాస...' పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. కళాతపస్వి దివంగత కె.విశ్వనాథ్ 'వాసవ సుహాస'ను విడుదల చేయడం గమనార్హం. సినిమాకు ఆ సాంగ్ మంచి బజ్ తీసుకు వచ్చింది. ఆ తర్వాత విడుదల చేసిన 'దర్శనా...' సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడది యువతకు లవ్ యాంథమ్ కింద మారింది. ఈ మూవీ ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో 'వినరో భాగ్యము విష్ణుకథ' విడుదలకు కొన్ని రోజుల ముందే లాభాల్లోకి వెళ్ళిందని తెలిసింది. బిజినెస్ మొత్తం క్లోజ్ అయ్యిందట. జీఏ 2 పిక్చర్స్ సంస్థకు కొంత మంది రెగ్యులర్ బయ్యర్స్ ఉన్నారు. కొన్ని ఏరియాల్లో సొంతంగా విడుదల చేస్తారు. ఆల్రెడీ సినిమా డిస్ట్రిబ్యూషన్ రేట్స్ & రైట్స్ ఫైనల్ చేశారు. డిజిటల్ & శాటిలైట్ స్ట్రీమింగ్ రైట్స్ కూడా అమ్మేశారు. వాటితో బడ్జెట్ మొత్తం రికవరీ కావడమే కాదు, లాభాలు వచ్చాయని తెలిసింది. 


Also Read : ఇళయరాజా సంగీతంలో ధనుష్ పాట - కమెడియన్ హీరోగా వస్తున్న సీరియస్ సినిమా కోసం


'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం', 'ప్రతి రోజూ పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్', 'ఊర్వశివో రాక్షసివో', '18 పేజెస్' వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించిన జీఏ 2 పిక్చర్స్ లో ఈ సినిమా మరో హిట్ అవుతుందని యూనిట్ నమ్ముతోంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు: స‌త్యగమిడి - శ‌రత్ చంద్ర నాయుడు, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డేనియ‌ల్, స‌హ నిర్మాత‌: బాబు, సంగీతం: చైత‌న్ భరద్వాజ్. ఈ మూవీ ఫిబ్రవరి 17 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.