Lionel Messi jersey: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అర్జెంటీనా నుంచి ఒక బహుమతి అందింది. అర్జెంటీనాకు చెందిన వైపీఎఫ్ అధ్యక్షుడు పాబ్లో గొంజాలెజ్ ఫిఫా ప్రపంచకప్ విజేత మెస్సీ ధరించిన జెర్సీని మోదీకి అందజేశారు. బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా ఈ బహుమతిని ఇచ్చారు.
గత డిసెంబర్ లో జరిగిన ఫిఫా ప్రపంచకప్ ను అర్జెంటీనా గెలుచుకుంది. ఈ ప్రపంచకప్ తో లియోనెల్ మెస్సీ తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నాడు. ఫైనల్ లో ఆ జట్టు ఫ్రాన్స్ ను ఓడించింది. 90 నిమిషాల మ్యాచ్ 2-2తో ముగియగా.. అదనపు సమయంలోనూ 3-3తో స్కోర్లు సమమయ్యాయి. అయితే పెనాల్టీ షూటౌట్ లో అర్జెంటీనా 4-2 తేడాతో ఫ్రాన్స్ ను ఓడించి కప్ ను అందుకుంది.
అర్జెంటీనా ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ గెలిచిన తర్వాత మన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కూడా ఆ దేశాన్ని అభినందించారు. "ఇది అత్యంత ఉత్కంఠభరితమైన ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో ఒకటిగా గుర్తుండిపోతుంది! #FIFAWorldCup ఛాంపియన్‌లుగా మారినందుకు అర్జెంటీనాకు అభినందనలు! వారు ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా ఆడారు. అర్జెంటీనా మరియు మెస్సీకి చెందిన మిలియన్ల మంది భారతీయ అభిమానులు ఈ అద్భుతమైన విజయంతో సంతోషిస్తున్నారు! అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.