బిగ్ బాస్.. ఒకప్పుడు ఈ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘బిగ్ బాస్’ తెలుగు మొదటి సీజన్ నుంచే చాలా సందడి చేసింది. మెల్లమెల్లగా ఈ రియాల్టీ షోకు ప్రేక్షకాదరణ పొందింది. దీంతో గత సంవత్సరం ఇదే సమయంలో ‘బిగ్ బాస్ తెలుగు’ ఓటీటీ వెర్షన్ ‘బిగ్ బాస్ - నాన్ స్టాప్’ పేరుతో లైవ్ స్ట్రీమింగ్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. దానికి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే, ఆ షో పెద్దగా క్లిక్ కాలేదు. అయితే, ఆ షో చివర్లో బిందు మాధవి వల్ల కాస్త వ్యూస్ పెరిగినట్లు తెలిసింది. చివరికి.. ఆమె ఆ షోలో విజేతగా నిలిచింది. అయితే, ‘బిగ్ బాస్’ సీజన్-6 ముగింపు సమయంలో ‘నాన్‌స్టాప్’ వెర్షన్ గురించి నాగ్ పెదవి విప్పలేదు. ఈ నేపథ్యంలో ‘నాన్‌స్టాప్’కు పుల్‌స్టాప్ పడినట్లే అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మొదట్లో ఎంతో పేరు సంపాదించుకున్న ‘బిగ్ బాస్’ రియాల్టీ షోకు క్రమంగా ప్రేక్షకాదరణ తగ్గుతోంది. ‘బిగ్ బాస్’ 6వ సీజన్ బుల్లితెర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో విమర్శలను సైతం ఎదుర్కొంది. ‘బిగ్ బాస్’ తెలుగు చరిత్రలోనే అత్యంత తక్కువ టీఆర్పీ వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ‘బిగ్ బాస్ - నాన్ స్టాప్’ రెండవ సీజన్ ను పునరుద్ధరించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘బిగ్ బాస్’ షోకు హోస్ట్ గా వ్యవహరించిన అక్కినేని నాగార్జున గతేడాది టీవీ, ఓటీటీ వెర్షన్‌ల ద్వారా సుమారు రూ.20 కోట్లకు పైగా గడించినట్లు సమాచారం. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఆయన ఒక షో మాత్రమే చేస్తానని చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం నాగ్ సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. బెజవాడ ప్రసన్నకుమార్ దర్శకత్వం వహిస్తున్న మూవీలో నటిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ రెండవ సీజన్ లేని క్రమంలో 2023, జూలై నెలలో ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 7 ప్రీమియర్ అవుతుందని తెలుస్తోంది. అయితే, ఈ సారి బిగ్ బాస్ హౌస్‌లోకి పోటీదారులుగా ఎవరు ప్రవేశించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే గతంలో నెలకొన్న సమస్యలు మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు బిగ్ బాస్ టీమ్ పూర్తిగా సీజన్ 7 పై దృష్టి సారించిందని తెలుస్తోంది. ఈ సీజన్ 7లో కంటెస్టెంట్స్ గా నటులు మహేశ్ బాబు కాళిదాసు, సిద్ధార్థ్ వర్మ, అమరదీప్, సాయి రోనక్, విష్ణు ప్రియ, ఈటీవీ ప్రభాకర్ తో పాటు కొరియోగ్రాఫర్ ‘ఢీ’ పండు, జబర్ధస్త్ అప్పారావు, సింగర్ సాకేత్, యూట్యూబర్ నిఖిల్ ఉంటారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అంతేకాదు.. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోకు వచ్చే సీజన్‌లో నాగార్జున హోస్ట్ బాధ్యతల నుంచి తప్పుకుంటారనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఆయన స్థానంలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహారిస్తారనే బజ్ ఉంది. బాలయ్య హోస్ట్ గా ‘ఆహా’ నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్ షో’ ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ షోకు ఇప్పటి వరకు హీరో నాని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ తర్వాత నాగార్జునలు హోస్ట్ లుగా వ్యవహరించారు. ఇప్పుడు బాలయ్య బాబు హోస్ట్ గా కన్ఫార్మ్ అయితే షో ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో నెలకొంది.
Also Read : స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?