ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కథానాయకుడిగా రూపొందుతోన్న సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ' (Vinaro Bhagyamu Vishnu Katha Movie). జీఏ2 పిక్చర్స్ పతాకంపై 'బన్నీ' వాసు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ఈ రోజు వెల్లడించారు.
ఫిబ్రవరి 17న 'వినరో భాగ్యము...'
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు. దానికి మూడు రోజుల తర్వాత... శివరాత్రి సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న 'వినరో భాగ్యము విష్ణు కథ'ను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. 'శివరాత్రికి మా విష్ణను కలవండి' అని యూనిట్ పేర్కొంది. ఆల్రెడీ శ్రీరామ నవమి సందర్భంగా ఫస్ట్ లుక్... ఆ తర్వాత జూలైలో టీజర్ విడుదల చేశారు. చిత్తూరు నేపథ్యంలో ఏడుకొండల వెంకన్న సాక్షిగా తిరుమల తిరుపతి కొండల కింద జరిగే కథతో రూపొందుతోన్న చిత్రమిది.
విడుదల తేదీ వెల్లడించిన సందర్భంగా ఒక స్టిల్ వదిలారు. అది చూస్తే... దణ్ణం పెడుతున్న కిరణ్ అబ్బవరం, అతని చుట్టూ గన్స్ పట్టుకుని, సేమ్ కలర్ డ్రస్సులో ఉన్న కొందరు విలన్లు. తిరుపతి నేపథ్యంలో కథలో ఆ గన్స్ ఏంటి? అనేది ఆసక్తి కలిగిస్తోంది.
'మాకు ఏడు వింతల గురించి పెద్దగా తెలియదు అన్నా! మా జీవితాలు అన్నీ ఏడు కొండల చుట్టూ తిరుగుతూ ఉంటాయి'' అని టీజర్ లో కిరణ్ అబ్బవరం డైలాగ్ చెప్పారు. అంతకు ముందు విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో... వెనుక దేవాలయం, ముందు బసవన్నతో కిరణ్ అబ్బవరం - పండుగ సమయంలో వచ్చే సన్నివేశంలో స్టిల్ టైపులో ఉంది.
'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం', 'ప్రతి రోజూ పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' లాంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన జీఏ 2 పిక్చర్స్ లో ఈ సినిమా మరో హిట్ అవుతుందని యూనిట్ నమ్ముతోంది. ఇటీవల గీతా ఆర్ట్స్ సంస్థ విడుదల చేసిన 'కాంతార' మంచి విజయం సాధించింది.
Also Read : కోరమీను - కేరాఫ్ జాలరి పేట, ఈగోలతో ముడిపడిన మీసాల కథ!
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన 'సెబాస్టియన్', 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' చిత్రాలు ఆశించిన రీతిలో ఆడలేదు. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్స్ అయ్యాయి. కానీ, ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. ఆ రెండు చిత్రాల మధ్యలో వచ్చిన 'సమ్మతమే' కాస్త పర్వాలేదనే పేరు తెచ్చుకుంది. అందుకని, ఎట్టి పరిస్థితుల్లోనూ 'వినరో భాగ్యము విష్ణు కథ'తో తప్పకుండా హిట్ అందుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అతను కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.
కిరణ్ అబ్బవరం సరసన కశ్మీర పర్ధేశీ (Kashmira Pardeshi) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాతో మురళీ కిశోర్ అబ్బురు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సత్య గమిడి - శరత్ చంద్ర నాయుడు, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డేనియల్, సహ నిర్మాత: బాబు, సంగీతం: చైతన్ భరద్వాజ్.