'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?' - పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన పోస్టర్ ఒకటి ఐదు రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రాజు గారి మీసాలు తీయడం ఏంటి? అనే క్యూరియాసిటీ నెటిజనుల్లో కలిగింది. ఆ ఆసక్తికి తెర దించుతూ ఈ రోజు అసలు విషయం చెప్పారు.
ఆనంద్ రవి హీరోగా 'కోరమీను'
ఆనంద్ రవి (Anand Ravi) కథానాయకుడిగా రూపొందుతోన్న సినిమాకు 'కోరమీను' (Korameenu Movie) టైటిల్ ఖరారు చేశారు. 'ఎ స్టోరీ ఆఫ్ ఈగోస్' అనేది ఉపశీర్షిక. మీసాలు తీసేశారనే పోస్టర్లు ఈ సినిమాపై ఆసక్తి కలిగించడం కోసమే విడుదల చేశారు. ఈ రోజు ఆ సినిమా టైటిల్ వెల్లడించడంతో పాటు హీరో ఫస్ట్ లుక్ (Korameenu Movie First Look) విడుదల చేశారు. 'కోరమీను' టైటిల్ పోస్టర్‌ను సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.
కోరమీను... కేరాఫ్ జాలరి పేట!
Korameenu Story Backdrop : 'కోరమీను' టైటిల్ మోషన్ పోస్టర్, ఆనంద్ రవి ఫస్ట్ లుక్ చూస్తే... సముద్ర తీరంలోని ఓ జాలరి పేట నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నట్టు అర్థం అవుతోంది. హీరో వెనుక చేపల వేటకు వెళ్లే పడవలు, వలకట్లు, తాళ్లు... మొత్తం మీద ఫస్ట్ లుక్ ఆసక్తిగా ఉంది. నేపథ్య సంగీతం బావుంది.
దర్శకుడు శ్రీపతి కర్రి (Sripathy Karri) మాట్లాడుతూ... ''మా సినిమా మోషన్ పోస్టర్ లావణ్య త్రిపాఠి గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. 'కోరమీను' కథ విషయానికి వస్తే... జాలారి పేట అనే మత్స్యకారుల కాలనీ నేపథ్యంలో సాగుతుంది. సరదాగా ఉండే ఓ పడవ డ్రైవర్, డబ్బుతో పాటు అహంకారం కల అతని యజమాని, విశాఖలోని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్... మూడు పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రమిది. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది'' అని అన్నారు.
ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీపతి కర్రి దర్శకత్వంలో పెళ్లకూరు సామాన్య రెడ్డి 'కోరమీను' చిత్రాన్ని నిర్మించారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు ఆనంద్ రవి అందించారు. 'ప్రతినిధి', 'నెపోలియన్' చిత్రాల తర్వాత ఆయన కథ అందిస్తున్న చిత్రమిది. 'నా నీడ పోయింది' అంటూ 'నెపోలియన్' సినిమాపై ప్రేక్షకుల్లో ఆయన ఆసక్తి కలిగించారు. ఇప్పుడు రాజు గారి మీసాలు తీసేశారంటూ మరోసారి ఆసక్తి కలిగించేలా ప్రచారం స్టార్ట్ చేశారు.
Also Read : సమంతకు ప్రాణాంతక వ్యాధి - ఏమైందో చెప్పిన బ్యూటీ!
కోటిగా ఆనంద్ రవి, కరుణ పాత్రలో హరీష్ ఉత్తమన్, మీసాల రాజుగా శత్రు, మీనాక్షిగా కిశోర్ ధాత్రక్, దేవుడిగా రాజా రవీంద్ర, సీఐ కృష్ణగా గిరిధర్, ముత్యం పాత్రలో 'జబర్దస్త్' ఇమ్మాన్యుయేల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రం పాత్రలో ప్రసన్న కుమార్, కరుణకు సహాయకుడిగా ఆర్కే నాయుడు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు : విజయ్ వర్ధన్ కె, ఛాయాగ్రహణం : కార్తీక్ కొప్పెర, సాహిత్యం: పూర్ణాచారి, లక్ష్మీ ప్రియాంక, సంగీతం: అనంత నారాయణన్ ఏజీ, నేపథ్య సంగీతం : సిద్ధార్థ్ సదాశివుని, కథ - స్క్రీన్ ప్లే - మాటలు : ఆనంద్ రవి, దర్శకుడు: శ్రీపతి కర్రి, నిర్మాత: పెళ్లకూరు సామాన్య రెడ్డి