Mahabubabad News : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బైపాస్ రోడ్డులో కారు వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లి ఘోరప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనను చూసిన సిద్ధు, రంజిత్, స్థానికులు బావి వద్దకు చేరుకొని వెంటనే బావిలోకి దిగి కారు అద్దాలు పగలగొట్టి ఓ బాబుతో సహా ముగ్గురుని రక్షించారు. డోర్ లాక్ కావడంతో మిగిలిన వారిని రక్షించేందుకు ఎంత ప్రయత్నించినా డోర్ తెరుచుకోకపోవడంతో నలుగురు మృతి చెందారు.  ఈ ప్రమాద సమయంలో కారులో మొత్తం ఏడుగురు ఉన్నారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన ఓ కుటుంబం దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. 


లిఫ్ట్ అడిగి 


వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గాను దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. మహబూబాబాద్ కు చెందిన తల్లీ, కొడుకు లలిత, సురేష్ లు దారిలో దిగుతామని లిఫ్ట్ అడిగి కారులో ఎక్కారు. కేసముద్రం వద్దకు రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడింది. ఈ దుర్ఘటనలో మహబూబాబాద్ కు చెందిన తల్లీ కొడుకులు లలిత, సురేష్ లతో పాటుగా టేకులపల్లికి చెందిన భార్యా భర్తలు అచ్చాలి, భద్రులు మృతి చెందారు. కారులో ముందు సీట్లో కూర్చున్న అచ్చలి, భద్రుల కూతురు, మనుమడు సుమలత, దీక్షిత్, డ్రైవర్ బిక్కులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఘటనా స్థలంలో తన తండ్రి కోసం సుమ చేసిన ఆర్తనాదాలు స్థానికులను కలచివేశాయి.  ప్రమాద సమాచారం అందుకున్న కేసముద్రం ఎస్ఐ రమేష్ సంఘటన స్థలానికి వెళ్లి, సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  


మంత్రి సత్యవతి విచారం వ్యక్తం 


కారు ప్రమాదంలో జరిగిన వెంటనే మంత్రి సత్యవతి రాథోడ్‌ జిల్లా కలెక్టర్‌, ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడారు. ఫోన్‌ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదంలో నలుగురు మృతి చెందడం విషాదకరమని మంత్రి అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రాణాలతో బయటపడిన వారికి చికిత్స అందించాలని, అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి శివారు గోల్యాతండాకు చెందిన చెందిన బానోతు భద్రు(39),  ఆయన భార్య బానోతు అచ్చాలి(35), మహబూబాబాద్‌ పట్టణం సురేస్ నగర్‌కు చెందిన గుగులోతు లలిత(40) ఆమె కుమారుడు గుగులోతు సురేస్ (14)లు మృతదేహాలకు మహబూబాబాద్ ఆసుపత్రిలో పోస్టు మార్టం పూర్తి అయింది.  


అధికారుల నిర్లక్ష్యం 


మహబూబాబాద్ జిల్లా కేసముద్రం కారు ప్రమాద ఘటనకు అధికారుల నిర్లక్ష్య వైఖరి ఓ కారణం అంటున్నారు స్థానికులు. రోడ్డు మూల మలుపులు, ప్రమాదాలు జరిగే చోట ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో రాత్రిళ్లు నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేసముద్రం మండలం కల్వల, ఇంటికన్నే, గాంధీ నగర్,తాళ్ళ పూసపల్లి, ఉప్పరపల్లి రోడ్డు పరిసర ప్రాంతాల్లో బావులు మూతలు తెరుచుకొని ఉన్నా ఆర్ ఎండ్ బి అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రాణాలు పోయినప్పుడు తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత చర్యలు చేపట్టడంలేదన్న విమర్శలు ఉన్నాయి.  అధికారులు ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి మరో ప్రమాదం జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.