రుద్రాక్ష చాలా పవిత్రమైంది. స్వయంగా శివుడి కంటి నుంచి రాలిన నీటి వల్ల ఈ మొక్కలు మొలిచి వాటి నుంచి ఈ రుద్రాక్షలు ఉద్భవించాయనేది ప్రతీతి. రుద్రాక్షలు చాలా రకాలుగా ఉంటాయి. ఎన్ని ముఖాలతో రుద్రాక్ష ఉందన్న దాన్ని బట్టి వీటిని విభజిస్తారు. మన దేశంలో అపర కైలాసంగా పిలుచుకునే హిమాలయాల పరివాహక ప్రాంతాలలో ఈ రుద్రాక్షలు విరివిగా ధరిస్తారు. వీటిని ధరించడం వల్ల మన:శాంతి, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సమస్యలలో ఉన్న వారికి సరైన ఎనర్జీని అందించేందుకు జ్యోతిష్యం రకరకాల పరిహారాలను సూచిస్తోంది. అలాంటి వాటిలో రుద్రాక్ష ధారణ కూడా ఒకటి. రుద్రాక్ష ధరించగలిగే వారు ధరిస్తారు. లేదంటే పూజలో ఉంచి కొలుచుకుంటారు.


రుద్రాక్షలు ధరించడం వల్ల గుండె జబ్బులు, రక్తపోటు వంటి వాటి నుంచి ఉపశమనం దొరుకుందని కూడా ఆయుర్వేదం చెబుతోంది.  రుద్రాక్షలు ఎన్ని ముఖాలు కలిగి ఉన్నాయన్న దాని బట్టి ఆ రుద్రాక్ష ఎనర్జీ అధారపడి ఉంటుంది. ముఖాల సంఖ్యను బట్టి రుద్రాక్ష ఏ దైవానికి సంబంధించినదనేది నిర్ణయిస్తారు. అంతేకాదు గ్రహస్థితి వ్యక్తుల స్థితి గతులను బట్టి ఎలాంటి రుద్రాక్ష ధరించాలనేది కూడా ఆధారపడి ఉంటుంది. చాలా మంది అవకాశాలు రాకపోవడం, అదృష్టం కలిసి రాకపోవడం, జీవితం ఉత్సాహ భరితంగా లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు.


రుద్రాక్ష ధరించడం ద్వారా వారి మార్గంలో ఏర్పడిన అడ్డంకులను దాటి సక్సెస్ సాధించవచ్చు. లక్ష్మీ కటాక్షం కూడా పొందవచ్చు. కొన్ని జ్యోతిష్య పరిహారాలను పాటించి అదృష్టాన్ని చేరుకోవచ్చు. వీటిలో మనకు సరైన రుద్రాక్ష ధరించడం కూడా ఇలాంటి పరిహారాలలో ఒకటి. ఎలాంటి రుద్రాక్ష ఎవరు ధరిస్తే లేదా కొలుకుంటే మంచిదనేది తెలుసుకోండి.



  • పదమూడు ముఖాలున్న రుద్రాక్ష ధరించడం వల్ల సమయానికి తగిన నిర్ణయాలు చేసుకుని ఆచరించడం సులభం అవుతుంది. ఇది సంపదకు అవసరమయ్యే చక్రాన్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. సంపద వైపు నడిచే మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించి మార్గం సుగమం చేస్తుంది. అందుకు అవసరమయ్యే వ్యక్తులను ఆకర్షించి మీతో కలుపుతుంది.

  • ఇరవై ఒక్క ముఖాలు కలిగిన రుద్రాక్ష సంపదను ఆకర్షిస్తుంది. ఈ రుద్రాక్ష నేరుగా కుబేరుడితో అనుసంధానం చేసి ఉంటుంది. అదృష్టాన్ని కోల్పోకుండా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది. సుఖమయ జీవితానికి కావల్సిన అన్నంటిని అందిస్తుంది.

  • ఏడు ముఖాలు కలిగిన రుద్రాక్షలో స్వయంగా లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది. రుద్రాక్ష సోమవారం రోజున సూర్యోదయానికి ముందే ధరించడం మంచిది.

  • కొన్ని రకాల కాంబినేషన్స్ లో 7,9,13,15 ముఖాలు కలిగిన రుద్రాక్షలు ధరించడం మరింత ప్రభావశీలంగా ఉంటుంది.

  • 19 ముఖాలు కలిగిన రుద్రాక్ష నారాయణుడి ప్రతిరూపం. ఈ రుద్రాక్ష అన్ని రకాల సంపదలను ఆకర్షిస్తుంది.

  • 18 ముఖాలున్న రుద్రాక్ష చాలా శక్తివంతమైంది. ఇది అదృష్టాన్ని అందిస్తుంది. అంతేకాదు భూసంబంధ డీల్స్ చేసే వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది భూదేవి ఆశీర్వాదం లభించేందుకు ఉపకరిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జించేందుకు, అఖండ సంపదకు కావల్సిన శక్తిని అందిస్తుంది.


Also Read: పాములను పూజించడం మూఢనమ్మకమా, పుట్టలో పాలు పోయకూడదా - ఏది నిజం!