‘KGF’ చిత్రంతో అద్భుత విజయాన్ని అందుకున్న కన్నడ స్టార్ యష్, ‘KGF2’తో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం సౌత్ టు నార్త్ అనే తేడా లేకుండా అద్భుత విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 1,000 కోట్లు సాధించింది. అయితే, సౌత్ నుంచి వచ్చిన పలు సినిమాలు అద్భుత విజయాన్ని అందుకోవడంతో బాలీవుడ్ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బాలీవుడ్ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడం, అదే సమయంలో సౌత్ సినిమాలు అద్భుత విజయాలు అందుకోవడంతో, హిందీ సినిమా పరిశ్రమ పని అయిపోందనే టాక్ నడుస్తోంది.


బాలీవుడ్ ను కించపరచకండి, కన్నడ ప్రజలకు యష్ విజ్ఞప్తి


ఈ నేపథ్యంలో ‘KGF’ స్టార్ యష్, కన్నడ ప్రజలకు ఓ కీలక విజ్ఞప్తి చేశారు. బాలీవుడ్ ను ఎవరూ కించపరచ కూడదని కోరారు. ఉత్తరాదిలో  దక్షిణాది సినిమాలు బాగా ఆడినంత మాత్రాన బాలీవుడ్ ను కించపర్చాల్సిన అవసరం లేదన్నారు. నార్త్ లో బాగా ఆడిన ‘‘KGF2’, ‘కాంతార’ ఇక్కడి దర్శకుల ప్రతిభకు నిదర్శనం. అయినంత మాత్రాన హిందీ సినీ పరిశ్రమను చెడుగా చూడాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికైనా నార్త్ వర్సెస్ సౌత్ సినిమాల మధ్య చర్చకు ముగింపు పలకాలని కోరారు. ఎవరినీ కార్నర్ చేయడం మంచిది కాదని ఆయన హితవు పలికారు.    


ఉత్తరం, దక్షిణం అనే మాటలను మర్చిపోవాలి! 


‘ఫిల్మ్ కంపానియన్‌’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో  యష్  కీలక వ్యాఖ్యలు చేశారు. “కర్ణాటక ప్రజలు మరే ఇతర పరిశ్రమను తక్కువగా చూడాలని నేను కోరుకోవడం లేదు. ఎందుకంటే, గతంలో మేమూ అణిచివేత సమస్యను ఎదుర్కొన్నాం. కానీ, ఇప్పుడు గౌరవం దక్కించుకునేలా ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాం. అందుకే, ఇప్పుడు మేము ఎవరినీ అగౌరపర్చాలి అనుకోవడం లేదు. మనం అందరినీ గౌరవించాలి, బాలీవుడ్ నూ గౌరవించాలి. ఈ ఉత్తరం, దక్షిణం అనే మాటలను మర్చిపోవాలి” అని యష్ అభిప్రాయపడ్డారు.  “బాలీవుడ్ సినిమాల్లో ఏమీ లేదు అని అపహాస్యం చేయడం మంచిది కాదు. ఆ సినిమా పరిశ్రమ ఇతర సినిమా పరిశ్రమలకు ఎన్నో విషయాలను నేర్పించింది అనే విషయాన్ని మర్చిపోకూడదు” అన్నారు.   


ప్రపంచ వ్యాప్తంగా రూ. 1,000 కోట్లు వసూలు చేసిన ‘KGF2’


యష్ హీరోగా చేసిన ‘KGF2’ బాక్సాఫీ దగ్గర అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర రూ.1,000 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 10,000 స్క్రీన్లలో విడుదలైంది. హిందీ, తెలుగు, తమిళం,  మలయాళంలో డబ్ చేసి విడుదల చేశారు.  






Read Also: ‘సర్కస్’ డిజాస్టర్ - పూజా హెగ్డే ఖాతాలో మరో ఫ్లాప్, బుట్టబొమ్మకు కలిసి రాని 2022