Malavika Avinash : 'కేజీఎఫ్' నటి మాళవిక అవినాష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె బెడ్ పై ఉన్న ఓ ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దాంతో పాటు మీలో ఎవరైనా మైగ్రేన్ తో బాధపడుతున్నట్టయితే.. దాన్ని తేలిగ్గా తీసుకోకండంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు మాళవిక త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.


కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మాళవిక అవినాష్. అంతకు ముందు పలు సీరియల్స్ లో నటించి, తన టాలెంట్ ను నిరూపించుకున్న ఆమె.. కన్నడ స్టార్ యష్ హీరోగా, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన యాక్షన్ మూవీ కేజీఎఫ్ లో నటించి మంచి ఛాన్స్ కొట్టేసింది. అప్పటి వరకూ కన్నడ ఫ్యాన్స్ కే దగ్గరైన ఈ నటి.. కేజీఎఫ్ సినిమాతో తెలుగు అభిమానులకూ పరిచయం అయ్యారు. ఇప్పటివరకూ 50కి పైగా సినిమాల్లో నటించిన మాళవిక.. 2014లో వచ్చిన మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి సినిమాలో తల్లిగా కనిపించింది. ఆ తర్వాత చాలా వరకు స్ట్రిక్ట్ రోల్స్ చేసింది. 


టాలెంట్ ఉంటే అవకాశాలు తప్పక వస్తాయనడానికి మాళవికే ఉదాహరణ. ఆమె పోషించిన పాత్రలు, నటనే ఆమెకు మంచి అవకాశాలు తీసుకువచ్చాయి. అలా ఆమె దగ్గరికి వచ్చిందే కేజీఎఫ్. కేజీఎఫ్‌ సినిమాలో కథను నడిపించే సీనియర్‌ ఉమెన్‌ జర్నలిస్ట్‌ పాత్రలో మాళవిక అద్భుతంగా నటించింది. ఇక ఆ సినిమాలో నటించాకే ఆమె మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. సినిమాలే కాదు పలు బుల్లితెర రియాలిటీ షోస్ కు కూడా జడ్జిగా వ్యవహరించింది.


నటిగా కంటే ముందు మాళవిక భరతనాట్యం నృత్యకారిణి కూడా. మాళవిక అవినాష్ తన ఐదేళ్ల వయస్సు నుంచే నృత్యంలో శిక్షణ తీసుకుంది. కృష్ణుని పాత్రను పోషించి ఇచ్చిన ఓ ప్రదర్శనలో ఆమెను ప్రసిద్ధ తమిళ దర్శకుడు జీవీ అయ్యర్చే గుర్తించి, ఆమె టాలెంట్ ను మెచ్చుకున్నారు. ఆ తర్వాత1988 లో కన్నడ చిత్రం కృష్ణావతార్‌లో ఆమె నటించింది. 12 సంవత్సరాల వయస్సులోనే బాలనటిగా రంగప్రవేశం చేసిన మాళవిక..  నక్కల రాజకుమారి, దైవతింటే వికృతికల్, కల్యాణోత్సవ, మరియు సమర వంటి చిత్రాలలో నటించింది.


ఇదిలా ఉండగా తాజాగా తాను తీవ్ర అస్వస్థతకు గురయ్యానంటూ మాళవికా అవినాష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గత కొన్నాళ్లుగా మైగ్రేన్‌తో బాధపడుతున్న ఆమె.. ఎవరికైనా ఈ సమస్య ఉంటే తేలికగా తీసుకోవద్దని సూచించింది. లేదంటే తనలా ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది. తాను మైగ్రేన్‌ సమస్య నుంచి బయటపడటం కోసం పనాడోల్, నెప్రోసిమ్‌తో పాటు సంప్రదాయ ఔషధం తీసుకున్నానని తెలిపింది. దాంతో పాటు మైగ్రేన్‌ సమస్య ఉన్న వారు ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాల్సిందిగా సూచించింది. మైగ్రేన్ సమస్య వల్ల ఆమె ముఖం ఉబ్బినట్టుగా తయారైంది. ఆసుపత్రి నుంచి ఆమె  షేర్ చేసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆమెకు ఏమైందోనని ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు.


Also Read : దేవుడి దయ వల్ల బావున్నా, గాయాలు కాలేదు - స్పందించిన సంజయ్ దత్