Asad Ahmad Encounter: 


ఎన్‌కౌంటర్ 


యూపీ మాఫియా డాన్ అతీక్ అహ్మద్‌ కొడుకు అసద్‌ను ఎన్‌కౌంటర్ చేశారు. ఉమేష్ పాల్ హత్య కేసులో అతడి హస్తమూ ఉందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ క్రమంలోనే Uttar Pradesh Special Task Force అసద్‌ను ఎన్‌కౌంటర్ చేసింది. డీఎస్‌పీతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. అసద్‌తో పాటు అతని సన్నిహితుడు గులాంపై కాల్పులు జరిపింది. వాళ్ల నుంచి తుపాకులు స్వాధీనం చేసుకుంది. వీరిద్దరి ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షల రివార్డు ఇస్తామని ఇప్పటికే యూపీ పోలీసులు ప్రకటించారు. ఈలోగా వాళ్ల జాడ తెలుసుకుని వెంటాడిన పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఉమేష్ పాల్‌ను హత్య జరిగిన సమయంలో సీసీటీవీలో అసద్ కూడా కనిపించాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. చివరకు వాళ్ల ఆచూకీ కనుక్కొని ఎన్‌కౌంటర్ చేసింది. ముందు గులాం పోలీసులపై ఫైరింగ్ జరిపాడు. స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ ప్రతిదాడులకు దిగింది. ఈ క్రమంలోనే అసద్, గులాం ప్రాణాలు విడిచారు. 






42 రౌండ్ల కాల్పులు 


పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం..ఉమేశ్ పాల్ హత్య తరవాత అసద్ లక్నోకి పారిపోయాడు. అక్కడి నుంచి కాన్పూర్, మీరట్‌కు వెళ్లి చివరకు ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్‌కు పారిపోవాలని చూశాడు. ఝాన్సీ ప్రాంతానికి వచ్చిన అసద్ అక్కడి నుంచి మధ్యప్రదేశ్‌ బార్డర్‌కు బైక్‌పై వెళ్లే క్రమంలోనే ఎన్‌కౌంటర్‌కు గురయ్యాడు. అతిక్ అహ్మద్ గ్యాంగ్‌లోనే ఓ ఇన్‌ఫార్మర్‌ అసద్‌ ఆచూకీని పోలీసులకు చెప్పాడు. ఆ ఆధారంగా 12 మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఝాన్సీలోని బబీనా రోడ్‌ వద్ద దాదాపు 42 రౌండ్ల కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లోని అసద్‌, గులాం చనిపోయారు. ఈ ఎన్‌కౌంటర్‌పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ని అభినందించారు. అటు యోగి ఆదిత్యనాథ్‌పైనా ప్రశంసలు కురుస్తున్నాయి. తండ్రిని అరెస్ట్ చేయడమే కాకుండా కొడుకుని కూడా ఎన్‌కౌంటర్ చేయించాడంటూ అందరూ అభినందిస్తున్నారు. కొడుకు మరణ వార్త విని అతిక్ అహ్మద్ బోరున విలపించినట్టు సమాచారం. ఆ తరవాత సొమ్మసిల్లి పడిపోయాడని తెలుస్తోంది.