BiGG Boss 6 Telugu: కార్తీక దీపంలో అమాయకంగా నవ్వుతూ కనిపించే హిమ అలియాస్ కీర్తి భట్ జీవితంలో ఎంతో విషాదం ఉంది. ఇంతవరకు ఆమెకు అమ్మానాన్న, ఒక ఫ్యామిలీ లేదని మాత్రమే తెలుసు అందరికీ. కానీ ఆమె ఎప్పటికీ తల్లి కాలేనని బయటపెట్టింది కీర్తి. సిసింద్రీ టాస్కు తరువాత బిగ్ బాస్ ఇచ్చిన బొమ్మలతో అందరూ అనుబంధం పెంచుకున్నారు. దీంతో బిగ్ బాస్ జీవితంలో పిల్లలు ఎంత ముఖ్యమో చెప్పమని అడిగారు. దీనిలో భాగంగా కీర్తి భట్ మాట్లాడుతూ తన గురించి ఎన్నో విషయాలు చెప్పింది.
పాపను పెంచుకున్నా కానీ...
‘నా జీవితం ఎంతో ఆనందంగా సాగింది. కానీ 2017లో అమ్మానాన్న, నేను, అన్నయ్య, వదినా, వాళ్ల చిన్న పాప కలిపి కారులో గుడికి వెళుతున్నాం. యాక్సిడెంట్ అయ్యింది. నేను కళ్లు తెరిచేసరికి నా ఫ్యామిలీ గుర్తొచ్చింది. అందరూ చనిపోయారని నాకు తెలుస్తోంది. నాకు కాస్త తెలివి వచ్చిన మరుసటి రోజే నాన్న చనిపోయారు. ఆ తరువాత నేను కోమాలోకి వెళ్లిపోయాను. 32 రోజులు కోమాలోనే ఉండి బయటికి వచ్చాను. చాలా గట్టిగా ఏడ్చాను. నన్నెందుకు ఇలా ఒంటరిగా వదిలి వెళ్లారు అని ఏడ్చాను. నన్నెవరూ చూసే వాళ్లు లేరు అని అర్థమైంది. ఒంటరిగా చేతిలో 375 రూపాయలతో బెంగుళూరు వచ్చా. 355 రూపాయలు బస్సు టిక్కెట్ కు ఖర్చయింది. చాలా ఆకలి వేస్తున్నా ఏమీ తినలేకపోయా. చివరికి కుక్కలకు వేసిన బ్రెడ్డు తీసుకుని తిన్నా.’ అని చెప్పుకొచ్చింది. ‘పరిస్థితులు బాగయ్యాక ఓ పాపను పెంచుకున్నా. ఆమెకు తను అని పేరు పెట్టా. తను వచ్చాకే నాకు జీవితంపై ఆశ పెరిగింది. పాపకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. బిగ్ బాస్ కి రావడానికి ముందే తను చనిపోయిందని కాల్ వచ్చింది. ఆమె చనిపోయినప్పుడు కూడా నేను పక్కన లేకపోవడం చాలా బాధనిపించింది’ అంది.
తల్లి కాలేను
కీర్తి భట్ మరింతగా తన గురించి చెప్పుకొచ్చింది ‘భవిష్యత్తులో నేను పెళ్లి చేసుకున్నా కూడా నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఎందుకంటే యాక్సిడెంట్ లో పొట్ట మీద దెబ్బ తాకడం వల్ల అది (గర్భసంచి) తీసేశారు.కానీ నేను హ్యాపీగానే ఉన్నా. ఇక్కడ్నించి వెళ్లాక మరో పాపని పెంచుకుంటా’ అంటూ చెప్పింది కీర్తి. ఈమె కథ వింటే కన్నీళ్లు ఆపడం కష్టం.
ఆత్మాహత్యాయత్నం
శ్రీ సత్య మాట్లాడుతూ తల్లిదండ్రులు ఏమైనా చెబితే ఎందుకో చెప్పారో వినమని నేటి పిల్లలకు చెప్పింది. తన తల్లి ఆత్మహత్యాయత్నం చేసిందని, అప్పుడు ఆసుపత్రిలో తాను మాత్రమే ఉన్నానని చెప్పింది. తరువాత తాను కూడా సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించానని చెప్పింది. అందుకే తాను ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతానని చెప్పుకొచ్చింది.
Also read: భవిష్యత్తులో నేను తల్లి అవుతానని అనుకుంటున్నా సుదీప ఎమోషనల్ స్టోరీ, కూతురి గురించి చెప్పిన ఆదిరెడ్డి