Kareena Kapoor About Social Media: బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. రెండు దశాబ్దాలకు పైగా హిందీ చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)ను పెళ్లి చేసుకున్న కరీనా... కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ సినిమాలతో బిజీగా అయ్యారు.
సైఫ్ సోషల్ మీడియా అస్సలు వాడరు- కరీనా
ఓ వైపు సినిమాలు, మరో వైపు పిల్లలతో బిజీగా ఉన్నా... సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది కరీనా కపూర్. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 11.7 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటుంది. వ్యక్తిగత జీవితంలో పాటు తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తుంటుంది. తాజాగా ABP Ideas of India 2024 ఈవెంట్ లో పాల్గొన్న కరీనా, తన భర్త సైఫ్ అలీ ఖాన్ సోషల్ మీడియాను ఎందుకు ఉపయోగించరో చెప్పుకొచ్చింది.
“సోషల్ మీడియాను ఉపయోగించడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నా అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి ఇదో మంచి వేదికగా భావిస్తా. నా ఫ్యాన్స్ నుంచి లభిస్తున్న ప్రేమ, ఆదరణ చూస్తుంటే... చాలా సంతోషంగా అనిపిస్తుంది. అయితే, సైఫ్ అలీ ఖాన్ మాత్రం సోషల్ మీడియాను అస్సలు ఉపయోగించరు. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, సెల్ఫీలు తీసుకోవడం లాంటివి ఆయనకు అస్సలు నచ్చవు. వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా బయటపెట్టుకోవడం ఆయనకు పెద్దగా ఇష్టం ఉండదు. సోషల్ మీడియా వినియోగం వల్ల కుటుంబం మీద, చేసే పని మీద ఎఫెక్ట్ పడుతుందని భావిస్తారు. అందుకే ఉపయోగించరు” అని చెప్పుకొచ్చింది కరీనా కపూర్ ఖాన్. అటు పెళ్లై పిల్లలు ఉన్నా, నటిగా రాణించడం సంతోషంగా ఉందని కరీనా తెలిపింది. వర్కింగ్ మదర్ గా కొనసాగడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని వెల్లడించింది. సినిమాలకు ఎంత సమాయాన్ని కేటాయిస్తున్నానో, అంతే మొత్తంలో కుటుంబానికి కేటాయిస్తున్నానని కరీనా వివరించింది.
మార్చి 29న ‘క్రూ’ సినిమా విడుదల
ఇక కరీనా ప్రస్తుతం ‘క్రూ’ అనే సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ నటీమణులు టబు, కృతి సనన్ తో కలిసి ఆమె ఈ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి రాజేష్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏక్తా కపూర్, రియా కపూర్ నిర్మిస్తున్నారు. మార్చి 29న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తున్న ముగ్గురు మహిళల జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో పంజాబీ సింగర్ & యాక్టర్ దిల్జీజ్ దోసాంజ్, కపిల్ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'సింగమ్ ఎగైన్'లోనూ కరీనా కనిపించనుంది.
Read Also: టాలెంట్ ఉంటేనే రాణిస్తారు, నెపొటిజంపై శోభిత ధూళిపాళ్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్